సుప్రీంకోర్టుకు కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తుల్ని నియమించాలని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ రోజు జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ చేశారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల సంఖ్య పదికి చేరింది. జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణకు ముందు రోజే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకంపై నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, గుజరాత్, సిక్కిం, తెలంగాణ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లకు పదోన్నతి కల్పించాలని కొలిజియం నిర్ణయించింది. ఇందులో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేసి సిక్కింకు బదిలీపై వెళ్లిన జస్టిస్ జేకే మహేశ్వరి కూడా ఉన్నారు.
అలాగే తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న, కేరళ హైకోర్టు న్యాయమూర్తి సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సంద్రేశ్ , గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలిజియం సిఫార్సు చేసింది. మొత్తంగా తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో సీనియార్టీ, వయసు ప్రకారం చూస్తే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంది. దేశానికి తొలి మహిళా చీఫ్ జస్టిస్ అమే అవతారని అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ లాయర్‌గా ఉన్న పీ.ఎస్. నర్సింహను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలిజియం సిఫార్సు చేసింది. బార్ నుంచి ఒకరిని న్యాయమూర్తిగా ఎంపిక చేస్తూ ఉంటారు. పీ.ఎస్. నర్సింహ తెలుగు వ్యక్తే. వీరందరి సిఫార్సులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి పంపితే.. నియామకాలు ఫైనల్ అవుతాయి. అలాగే తెలంగాణ హైకోర్టుకు న్యాయాధికారుల కోటా నుంచి ఏడుగురు న్యాయమూర్తుల్ని నియమించేలా కొలిజియం సిఫార్సు చేసింది.