తెలుగు360 రేటింగ్ : 2.75/5
సినిమా ప్రేమలకు ఎన్ని అవరోధాలో. కులం, డబ్బు, మతం, ప్రాంతం, దేశం – అన్నీ అడ్డుపడుతుంటాయి. వాటని దాటుకుని ప్రేమికులు ఎలా కలిశారన్నదే కథలవుతుంటాయి. ఇప్పుడు ఈ అంతరాలలో రంగు కూడా చేరితే.. అది `కలర్ ఫొటో`.
ఓ నల్లని అబ్బాయి. ఓ తెల్లని అమ్మాయి.
గులాబీ పువ్వు – గులాబ్ జామ్ లాంటి కాంబినేషన్.
వీళ్ల ప్రేమకు అడ్డుకట్ట – రంగే.
దాన్ని ఈ ప్రేమ జంట దాటుకొచ్చిందా? లేదంటే – విధిని ఎదిరించలేక చతికిలపడిందా? అన్నదే కథ.
జయకృష్ణ (సుహాస్) ది పేదింటి కుటుంబం. అమ్మ లేదు. లేగ దూడల్ని, గేదెల్నీ పెంచుకుంటూ వాటిలో అమ్మని చూసుకుంటూ, పాలు అమ్ముకుంటూ, ఆ డబ్బులతో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. మంచి ఉద్యోగం సంపాదించి, తన తండ్రిని బాగా చూసుకోవాలన్నదే తన కల. అదే కాలేజీలో చదువుతున్న దీప్తి (చాందిని చౌదరి)ని చూసి, తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. అది ప్రేమ అనేకంటే, ఆరాధన, భక్తీ అనుకోవొచ్చు. అందుకే ఎప్పుడూ `ఏవండీ..` అని పిలుచుకుంటాడే తప్ప, హద్దులు దాటడు. జయ కృష్ణ మంచి తనం చూసి, దీప్తీ కూడా ఇష్ట పడుతుంది. కాలేజీలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ప్రేమించుకుంటుంటారు. కానీ.. సడన్‌గా ఓ రోజు ఈ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోతుంది. దీప్తి అన్నయ్య రామరాజు (సునీల్) పంచాయితీకి వస్తాడు. తనో ఎస్సై. ప్రేమ వ్యవహారాలు అస్సలు నచ్చవు. అందుకే దీప్తికీ, జయకృష్ణకీ అడ్డుగోడలు కట్టేస్తాడు. వాటిని ఈ జంట దాటుకొచ్చిందా, లేదా? అన్నది మిగిలిన కథ.
ప్రతీ ప్రేమకథకీ ఓ కాన్లిఫ్ట్ ఉంటుంది. అది ఈ సినిమాకి `కలర్` అయ్యింది. అందుకే ఇది `కలర్ ఫొటో`. రాసుకున్న కథలో పాయింట్ అతి చిన్నది. ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా `కలర్` అనే పాయింటు దాటి కథ రాదు. అలాంటప్పుడు ఆ పాయింట్ చుట్టూ అందమైన సన్నివేశాలు పడాలి. కథలో, సన్నివేశాల్లో, పాత్రల ప్రవర్తనలో హుషారు ఉండాలి. అది ఈసినిమాలో ఉంటుంది. కానీ ఉన్నట్టా.. లేనట్టా.. అని ఉంటుంది. ప్రతీ సన్నివేశంలోనూ ఏదో ఓ మెరుపు కనిపిస్తుంది. కానీ.. ఆ సన్నివేశం మొత్తాన్ని నిలబెట్టడానికి అది సరిపోలేదు. సినిమా ప్రారంభంలోనే… ఓ మూడ్ క్రియేట్ చేయగలగాలి. సినిమా చూడాలన్న ఆసక్తినీ, కోరికనీ బలంగా కలగజేయాలి. `కలర్‌ఫొటో`లో అది లోపించింది. టేకాఫే చాలా స్లోగా ఉంటుంది. మెల్లమెల్లగా కథని, అందులోని ఎమోషన్ని పెంచుకుంటూ, నలుపూ – తెలుపుల మధ్య ప్రేమ వికసించేలోగా ఇంట్రవెల్ వచ్చేస్తుంది.
నా బతుకూ.. రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్ లాగా సినిమా థియేటర్లో బల్బులా ఉంటాయంతే. వెలగడాలుండవు – అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. కథ, కథనం కూడా అలానే సాగుతుంటుంది. అన్నీ ఉన్నాయే అనిపిస్తుంది. కానీ ప్రభావవంతంగా కనిపించవు. తొలి సగంలో సునీల్ పాత్ర ఒకే ఒక్క సీన్‌కి పరిమితం అయిపోతుంది. ద్వితీయార్థంలో మాత్రం ఆ పాత్రకు స్పేస్ ఎక్కువ. సునీల్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తాడో, అప్పటి నుంచీ ప్రేమకు అవరోధాలు ఎదురవుతాయి. అక్కడ ఎమోషన్ ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు. సునీల్ లో విలనిజం డోసు మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయాడు. కాకపోతే కొన్ని సన్నివేశాలు చూడ్డం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా బిరియానీ సీను. అక్కడ తమిళ వాసన ప్రస్పుటంగా కనిపిస్తుంది. నిజానికి విలనిజం పండాలంటే అది చాలా సులభమైన మార్గం. సునీల్ ప్రవర్తన, డైలాగ్ డెలివరీ, మేనరిజం నుంచి విలనిజం తీసుకురావాల్సింది. క్లైమాక్స్ లో కూడా తమిళ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. కాకపోతే.. తొలి భాగంతో పోలిస్తే.. కాస్త నిలబడగలిగిందీ, మాట్లాడుకొనేలా చేసింది.. పతాక సన్నివేశాలే.
ప్రారంభ సన్నివేశాల్లో కథానాయికకి ఏదో డిజార్డర్ ఉన్నట్టు చూపించారు. అదెందుకో క్లైమాక్స్‌లో అర్థం అవుతుంది కూడా. కానీ ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయేలా దాన్ని చూపించాల్సింది. శవం దగ్గర ఫజిల్ ఫిల్ చేయించి, తనలో ఏ ఎమోషన్ లేదని కథానాయిక పాత్రలో చూపించారు. తీరా చూస్తే.. తదుపరి సన్నివేశం నుంచే తనలోని అన్ని ఎమోషన్స్ బయటకు వస్తాయి. ఇది దర్శకుడి ఆలోచనలో లోపమా? ఆ పాత్రలో లోపమా? అన్నది కాస్త కన్ఫ్యూజన్గా మారింది.
సుహాస్ యూ ట్యూబ్ తో పాపులర్ అయిన నటుడు. తరవాత కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు చేశాడు. తన టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమాలో తన పాత్రని పూర్తిగా ఎమోషనల్ గా డీల్ చేశాడు దర్శకుడు. సుహాస్‌లో నటుడు ఎలివేట్ అవ్వడానికి అది ఉపయోగపడి ఉంటుంది. కానీ.. తనలోని కామెడీ యాంగిల్ ని కూడా బాగా వాడుకోవాల్సింది. `నేను ఈ కథని నడిపించేవాడ్ని మాత్రమే` అని ఓ సందర్భంలో సుహాస్ చేత చెప్పించాడు దర్శకుడు. ప్రేక్షకుడూ అలానే భావించి చూస్తేనే సుహాస్ పాత్రని ఫాలో అవ్వగలం. .
చాందిని చౌదరి కూడా బాగానే చేసింది. వైవా హర్షకి మంచి పాత్ర పడింది. తనలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందని అర్థమైంది. ఈ సినిమాకి కాస్తో కూస్తో కాలక్షేపం తనే. ప్రధమార్థం చూసినప్పుడు సునీల్ మిస్ ఫైర్ అవుతున్నాడేమో అనిపించింది. కానీ ద్వితీయార్థంలో తనే ఆదుకున్నాడు. విలన్‌గా సడన్‌గా భారీ వేరియేషన్ చూపించాడు. మిగిలిన అన్ని పాత్రలూ సహజంగానే కనిపించాయి.
టెక్నికల్‌గా చెప్పాలనుకుంటే ఎక్కువ మార్కులు కాలభైరవకే ఇవ్వాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బిట్ సాంగ్స్ తో.. సన్నివేశాల్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఫొటోగ్రఫీ ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఓకే అనిపిస్తాయి. కొన్ని డైలాగులు బాగున్నాయి. ఇంకొన్ని ఫేస్ బుక్ కొటేషన్లని గుర్తు చేశాయి. (బురద నీళ్లు మంటలను ఆర్పడానికైనా ఉపయోగపడతాయి.. లాంటివి). కథలో పాయింట్ చిన్నది. అయినా.. ద్వితీయార్థంలో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడంటే.. దర్శకుడిలో (కథ తనది కాదు) విషయం ఉన్నట్టే అనిపిస్తుంది.
తెలుగు360 రేటింగ్ : 2.75/5