పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వేసిన రంగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి కాదట. ఈ విషయాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాదులు.. ఏ మాత్రం సంకోచించకుండా.. సిగ్గు పడకండా… హైకోర్టులో న్యాయమూర్తుల ముందు చెప్పేశారు. దాంతో న్యాయమూర్తులు కూడా అవాక్కయ్యారు. రంగులను మేము పోల్చుకోగలమని …పార్టీ టీడీపీ, వైసీపీ జెండా గుర్తులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. రంగులపై మాత్రమే కాదు… విచారణలో… గ్రామ సచివాలయాలపై ముఖ్యమంత్రి ఫోటో ఉండటంపైనా… హైకోర్టు ప్రశ్నించింది. పంచాయతీ ఆఫీసులపై సీఎం ఫోటో ఎందుకు ముద్రించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి లాయర్ విచిత్రంగా సమాధానం ఇచ్చారు.
ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టే ముద్రించారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ న్యాయవాది అంత నిర్లక్ష్యంగా సమాధానంచ చెప్పడంతో.. ధర్మాసనం మండిపడింది. పార్లమెంటుపై ప్రధాని ఫోటో, సుప్రీంకోర్టుపై సీజేఐ ఫోటో ముద్రించారా అని ప్రశ్నించారు. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడుందో చూపించాలని ఆదేశించింది. కార్యాలయాల లోపల పెట్టుకోవచ్చని.. మొత్తం వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. రంగుల తొలగింపుపై.. ఎన్నికల కమిషన్… తరపు న్యాయవాది కూడా… వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం ఇంకా ఎన్నికల ప్రకటన చేయలేదు కాబట్టి.. తమకు ఎలాంటి అధికారం లేదని… వాదించారు. ఎన్నికల కమిషన్కు అధికారం లేనప్పుడు తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపు న్యాయవాదులు… అంతా ప్రభుత్వ ఇష్టం అన్నట్లుగా… కోర్టులో వాదించడం.. రంగులు వైసీపీ కాదని.. నేరుగా న్యాయమూర్తులతోనే వితండ వాదం చేయడంపైనా.. న్యాయవాద వర్గాలను సైతం విస్మయ పరిచింది.