చిరంజీవి పవన్ కల్యాణ్ కలసి నటిస్తే ఎలా ఉంటుంది?
నందమూరి బాలకృష్ణ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తే..??
వినడానికీ, వార్తలుగా రాసుకోవడానికీ ఈ కాంబినేషన్లు బహు బాగుంటాయి. కానీ వర్క్ అవుట్ అవుతాయా అంటే డౌటాతి డౌటు.
ఆ మధ్య చిరు, పవన్, చరణ్, బన్నీలతో మెగా మల్టీస్టారర్ సినిమా తీస్తేస్తా.. అని ప్రకటించేశాడు ఓ పెద్దాయన. ‘అబ్బ.. మీరు సూపరండీ..’ అంటూ అంతా మురిసిపోయారు.. ఆ తరవాత మర్చిపోయారు. ఎందుకంటే అది `కలల` కాంబినేషన్ మాత్రమే. అంటే కలల్లో ఊహించుకోవడానికి తప్ప.. నిజ జీవితంలో సాధ్యం కావు గాక కావు.
ఇద్దరు హీరోల్ని పక్క పక్కన నిలబెట్టి, వాళ్ల ఇమేజ్‌లకు సరిపడా కథలు రాసుకోవడానికీ, అలా రాసుకొన్న కథల్ని సినిమాలుగా తీసుకోవడానికీ నానా పాట్లు పడుతున్నారు దర్శక నిర్మాతలు. వాళ్లకు ఇలాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్లు మరింత టెన్షన్‌ని క్రియేట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరు సినిమాలో చరణ్ ఓ స్టెప్పువేసి వెళ్లిపోవడం, చరణ్ సినిమాలో బన్నీ గెస్ట్ రోల్ లాంటి పాత్రలో కనిపించడం అంత వరకూ బాగానే ఉంటుంది. వాళ్లతో పూర్తి స్థాయి సినిమా అంటేనే చమటలు పట్టేస్తాయి. చిరు – చరణ్‌లతో సినిమా ట్రై చేయొచ్చు. ఎందుకంటే తండ్రీ కొడుకులిద్దరూ ఒకరి కోసం ఇంకొకరు తమ పాత్రల్ని తగ్గించుకోవడానికి వెనుకంజ వేయరు. ఇదే సినిమాలో పవన్నీ, బన్నీనీ కలపేయాలని చూడడం మాత్రం కచ్చితంగా అనాలోచినతమైన నిర్ణయమే. పవన్‌కీ చిరు కుటుంబానికీ మధ్య బంధం అంత గట్టిగా లేదన్నది మెగా అభిమానులు సైతం ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఆడియో ఫంక్షన్లకే పవన్ రావడం లేదు. ఇక సినిమా తీస్తానంటే.. అంత ఈజీగా ఒకే అనేస్తాడా?
ఇప్పుడు బాలయ్య, ఎన్టీఆర్‌లు కలసి నటిస్తారన్న కొత్త వార్త బయటకు వచ్చింది. దీనికి దిల్‌రాజు ప్రొడ్యూసర్ అనీ, ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారని ఆ గాసిప్పుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు రాసుకొంటున్నారు. అయితే ఇవి కూడా అచ్చంగా గాలివార్తలే. ‘మా బాబాయ్ అంటే నాకు ప్రాణం’ అని ఎన్టీఆర్ మైకు పట్టుకొని ఎన్ని కబుర్లయినా చెప్పొచ్చు గాక. కానీ… అబ్బాయ్ బాబాయ్ ల మధ్య రిలేషన్ తెగిపోయిన గాలిపటం అన్నది ఇండ్రస్ట్రీ వర్గాలు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాయి. ఇది వరకు తన సినిమాల్లోని డైలాగుల్లో బాబాయ్, తాతయ్య అంటూ ఎన్టీఆర్‌నీ, బాలకృష్ణనీ గుర్తు చేసేవాడు. అది మానేసే చాలా కాలం అయ్యింది. అడపా దడపా ఎన్టీఆర్ అయినా.. ‘బాబాయ్’ మాట ఎత్తుతున్నాడేమో. బాలకృష్ణ నోటి నుంచి ఎన్టీఆర్ అనే పదం విని చాలా కాలమైంది. ఈ సమయంలో వీరిద్దరితో సినిమాని కలలో ఊహించడం కూడా అత్యాసే. నందమూరి మల్టీస్టారర్ అంటే.. ఎన్టీఆర్ – కల్యాణ్ రామ్, లేదంటే బాలకృష్ణ – కల్యాణ్ రామ్. అంతకు మించి ఆశించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పాతి తప్పు. దట్సాల్..!