హైపర్ ఆది మీద మరొక వివాదం చెలరేగింది . ఆదివారం జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పండుగలని కించపరుస్తూ ఉన్నాడని తెలంగాణ జాగృతి ఫెడరేషన్ అనే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అగ్ర ఛానల్ హైపర్ ఆది ని టార్గెట్ గా చేసుకుని గంటలతరబడి కార్యక్రమాలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే..
కేసు నమోదు చేయకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న పోలీసులు:
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో బతుకమ్మ సందర్భంగా పాడుకునే ఒక పాటని హైపర్ ఆది పేరడీ చేశాడని ఫిర్యాదు చేశారు తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సంబంధించిన వ్యక్తులు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేయదగ్గ తప్పు ఇందులో ఉందా లేదా అనే విషయంపై ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అయితే కేసు నమోదు కాకపోయినా అవతలి మనుషులను టార్గెట్ చేసి బద్నాం చేయడానికి ఈ మాత్రం కంటెంట్ సరిపోతుంది అనే ఉద్దేశంతోనో ఏమో కానీ ఒక అగ్ర ఛానల్ మాత్రం హైపర్ ఆది ని ఉతికి ఆరేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా అగ్ర చానల్ హైపర్ ఆది ని విమర్శించడానికి వాడిన పదాలు- సభ్య సమాజం తలదించుకునే, వెకిలి చేష్టలు, పరమ బూతు లాంటివి.
అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే సమస్యలపై స్క్రోలింగ్ వేయడానికి వెనకాడతారు కానీ…
అగ్ర ఛానల్ పై మొదటి నుండి ఉన్న విమర్శ ఏంటంటే, అధికార పక్షాన్ని ఇరుకున పెడుతుంది అనుకుంటే అసలైన ప్రజా సమస్యలను ఏ మాత్రం స్క్రోలింగ్ కూడా ఇవ్వకుండా వదిలివేయడానికి అగ్ర ఛానల్ ఎంత మాత్రం వెనుకాడదు అని. గత ప్రభుత్వ హయాంలో పుష్కరాల్లో అంత మంది చనిపోతే దానిమీద అగ్ర ఛానల్ కేటాయించిన సమయం, జబర్దస్త్ ప్రోగ్రాం ని కత్తి మహేష్ చేత విమర్శించడానికి కేటాయించిన సమయంలో ఒక శాతం కూడా ఉండదు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఊరూరా ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభిస్తే దానిమీద ఎటువంటి కార్యక్రమం చెయ్యలేదు అని టీవీ చానల్స్ మీద విమర్శలు వచ్చిన తర్వాత కానీ 10 నిమిషాల కార్యక్రమం చేయని ఛానల్, హైపర్ ఆది మీద కార్యక్రమం చేయడానికి మాత్రం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయలేదు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఓ కార్యక్రమానికి అయిదారు లక్షల మంది హాజరయినపుడు దానిమీద పదినిమిషాల కార్యక్రమం ఇవ్వడానికి తటపటాయించే అగ్ర చానల్, ఏదో ఒక వినోద కార్యక్రమంలో హైపర్ ఆది లాంటివాళ్ళు చేసిన ఒక చిన్న వ్యాఖ్య పట్టుకుని గంటల తరబడి కార్యక్రమాలు చేయడం ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తోంది.
క్షమాపణ చెప్పిన హైపర్ ఆది:
అయితే ఈ వివాదంపై స్పందించిన హైపర్ ఆది తాను ఆ షో లో కేవలం పది మందిలో ఒక ఆర్టిస్ట్ మాత్రమేనని, ఏదైనా ఎడిటింగ్ పొరపాటు వల్ల ఇలాంటివి జరిగి ఉండవచ్చునని అయినప్పటికీ తన వల్ల తప్పు జరిగిందంటే తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని హైపర్ ఆది వ్యాఖ్యానించారు.
మల్లెమాల, రామోజీరావు ని ప్రశ్నించే దమ్ము అగ్ర ఛానల్ కి లేదా?
నిజానికి హైపర్ ఆది కేవలం ఒక చిన్న ఆర్టిస్ట్ మాత్రమే. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అన్ని రకాలుగా దానిని పరిశీలించుకుని అవసరమైతే ఎడిట్ చేసుకుని సరైన రీతిలో ప్రసారం చేయవలసిన బాధ్యత నిర్మాణసంస్థ మల్లెమాల వారిది. మల్లెమాల వారు ఇచ్చిన కార్యక్రమాన్ని మరొకసారి సరిచూసుకుని ప్రసారం చేసే బాధ్యత ఈటీవీ సంస్థ ది. కానీ ఎప్పుడు ఏ పొరపాటు జరిగినా మల్లెమాల వైపు కానీ, రామోజీరావు వైపు కానీ వేలెత్తి చూపే దమ్ము ధైర్యం లేకనే అందులో నెల జీతానికి పని చేసే ఆర్టిస్టులపై అగ్ర ఛానల్ ప్రతాపం చూపుతోంది అనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మొత్తం మీద:
జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల లో కొంతవరకు కామెడీ శృతి మించుతోంది అన్న విమర్శలు నిజమే. కానీ ఇంటిల్లపాది కూర్చుని చూసే మరొక కార్యక్రమాన్ని అటు ఆ అగ్ర చానల్ కానీ ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ చేయలేక పోతుండడంతో ప్రేక్షకులు కనీసం వినోదం కోసం ఈ లాక్ డౌన్ సమయంలో ఆ కార్యక్రమాల పైన ఆధారపడుతున్నారు. అసలైన ప్రజాసమస్యలు ఎన్నో ఉండగా, వాటి మీద అనేక స్వచ్ఛంద సంస్థలు రకరకాల ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేస్తూ ఉండగా, వాటిని కవర్ చేయడం వదిలేసి కామెడీ ఆర్టిస్టుల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఎంతవరకు న్యాయం అన్నది చానల్ కి చెందిన వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి.