2015 సం.లో తెలుగు చిత్రసీమ అనేకమంది హాస్య నటులను, ఇతర నటీ నటులను కోల్పోయింది. ఇంకో రెండు రోజుల్లో ఈ సంవత్సరం ముగుస్తుందనగా నేడు మరో హాస్య నటుడిని కోల్పోయింది. హాస్య నటనలో తనదయిన శైలిలో నటిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న ప్రముఖ హాస్యనటుడు పొట్టి రాంబాబు ఈరోజు (మంగళవారం) ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆకస్మికంగా మరణించారు. ఆయనకు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. పొట్టి రాంబాబు దాదాపు 40 సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మెప్పించారు. ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, ప్రేమతో నువ్వు వస్తావని మొదలయిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవలే ఆయన పులిరాజా ఐ.పి.ఎస్. అనే సినిమాలో హీరో పాత్ర చేసారు.