ప్రస్తుతం నటుడిగా ప్రియదర్శి ఫుల్ బిజీ. ఓ పక్క పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. మరో పక్క `మిఠాయి`, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం`లో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ప్రియదర్శి స్నేహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. `పెళ్లి చూపులు`తో ప్రియదర్శికి బ్రేక్ ఇచ్చింది అతడే. ప్రస్తుతం `ఫలక్‌నుమా దాస్`లో పోలీస్‌గా, విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న సినిమాలో ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నాడు.
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటిస్తున్న `మిఠాయి` ఆడియోకి అతిథిగా వచ్చిన తరుణ్ భాస్కర్ “నేను యాక్టర్ అయ్యానని ఏడిపిస్తున్నారు. ప్రియదర్శి త్వరలో డైరెక్టర్ కాబోతున్నాడు“ అన్నాడు. అతడు చెప్పేటప్పుడు కాదన్నట్టు సైగలు చేసిన ప్రియదర్శి, తరవాత స్పీచ్‌లో తరుణ్ భాస్కర్ మాటలను ఖండించలేదు. డైరెక్షన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నెల 22న విడుదలవుతున్న `మిఠాయి`కి వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బాధ్యత తమదని, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నవ్విస్తామని ప్రియదర్శి అన్నారు.