చాలా కాలం పాటు కష్టపడి సినిమాల్లో కమెడియన్‌గా ఓ స్థాయికి అలా చేరుకున్న సమయంలో ఇలా పాలిటిక్స్‌లో వేరు పెట్టి నానా రచ్చ చేసేసిన “ధర్టీ ఇయర్స్‌కి ఫృధ్వీ” ఇప్పుడు ఎక్కడా కనిపించట్లా. ఆయనకు అవకాశాలు రావడం ఎప్పుడో మానేశాయి. రాజకీయంలోనూ ఆయనను ఆమడ దూరంలో పెడుతున్నారు. పట్టించుకునేవారు లేరు. దీంతో ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో తెలియడం లేదు. కనీసం కడుపు నింపిన వృత్తి అయినా చేసుకుందామని ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు. బుద్ది వచ్చిందంటూ లెంపలు వేసుకుంటున్నారు.
2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఫృధ్వీ ప్రచారం చేశారు. కొంత మంది ఆర్టిస్టుల గుంపును తీసుకుని విస్తృతంగా తిరిగారు. మామూలుగా తిరిగితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. తాను వైసీపీకి ప్రచారం అంటే ఇతర పార్టీలను.. ఆ పార్టీ నేతలను బండ బూతులు తిట్టడమే ప్రచారం అనుకున్నారు. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయారు. చివరికి మెగా ఫ్యామిలీనీ వదల్లేదు. ఆయన అలాఅందర్నీ తిట్టడం వైసీపీ పెద్దలకు నచ్చిందేమో కానీ.. తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చింత కాలం నిలబెట్టుకోలేకపోయారు. వైసీపీలోనే కుట్రలు చేసి ఆయనను బయటకు పంపేశారు. అప్పట్నుంచి ఫృధ్వీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిపోయింది.
ఒకప్పుడు రోజుకు రూ. ఐదు లక్షల వరకూ తీసుకున్న స్థాయికి వెళ్లిన ఫృధ్వీకి ఇప్పుడు వేషాలు కరువయ్యాయి. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. ఉపాధి చూపించే అవకాశం లేదు. ఇటు ఇండస్ట్రీలో ఆయన చేసిన వ్యవహారాలు ఇంకా సమసిపోలేదు. అందుకే బుద్దొచ్చిందంటూ చాన్సిచ్చిన ప్రతీ మీడియాముందు చెబుతున్నారు. కానీ ఆయన చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నా.. క్షమిస్తారేమో కానీ.. మళ్లీ నెత్తిన పెట్టుకునే అవకాశం మాత్రం ఉండదనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎగిరెగిరిపడితే చివరికి ఏమవుతుందో ఫృధ్వీ పరిస్థితే సాక్ష్యమని చెప్పుకునేందుకు ఉపయోగపడతారు.