అక్టోబరు 1.. అల్లు రామలింగయ్య వందో పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కోకా పేటలోని అల్లూ స్టూడియోస్ ప్రారంభం కానుంది. చిరంజీవి చేతుల మీదుగా.. ఈ స్టూడియో ప్రారంభిస్తారు. అదే రోజున అల్లు రామలింగయ్యని స్మరించుకొంటూ ఓ కార్యక్రమం చేయబోతున్నారు. చిత్రసీమలోని ప్రముఖ హాస్య నటుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి వాళ్లందరినీ సన్మానించబోతున్నారు. బ్రహ్మానందం, బాబూ మోహన్, అలీ, కృష్ణ భగవాన్ మొదలుకొని, ఈతరం కమెడియన్లని సైతం ఈ వేదికపై సన్మానించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. అల్లూ రామలింగయ్య పేరుతో జాతీయ అవార్డు ఒకటి నెలకొల్పి ప్రతీ యేటా హాస్య నటులకు ఈ అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నేళ్ల నుంచి అల్లు అవార్డుల్నిపట్టించుకోవడం లేదు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించే అవకాశం ఉంది.
అల్లూస్టూడియోలో.. `పుష్ప2` కూడా మొదలుపెట్టబోతున్నారు. అక్టోబరులో పుష్ప 2 షూటింగ్ అల్లు స్టూడియోలోనే జరగబోతోంది. అందుకోసం ఓ ప్రత్యేకమైన సెట్ ని తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం.