సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్టు.. జోనర్లన్నింటిలోనూ హాస్యం ప్రధానం అని నమ్ముతుంది చిత్రసీమ. పక్కాగా నవ్వించాలే కానీ, సినిమా హిట్టవ్వడం గ్యారెంటీ. ఇలాంటి సినిమాలకు జనాల్లో రీచ్ కూడా ఎక్కువ. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే అవకాశం కామెడీ చిత్రాలకే ఉంటుంది. పైగా రిపీట్ మోడ్ లో థియేటర్లకు జనం వస్తారు. లాజిక్కులు అడగరు. స్టార్లు అవసరం లేదు. అందుకే వినోదాత్మక చిత్రాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈమధ్య కాలంలో కామెడీ చిత్రాలు వర్కవుట్ అవుతుండడం కొంత సంతోషాన్ని కలిగించే విషయమే. ఆగస్టులో విడుదలైన కమిటీ కుర్రాళ్లు, ఆయ్ చిత్రాలు వినోదానికే పెద్ద పీట వేశాయి. ఇప్పుడు ‘మత్తు వదలరా 2’ అందరి మత్తూ వదలగొడుతోంది. `మత్తు వదలరా`కి సీక్వెల్ గా వచ్చిన సినిమా ఇది. తొలి భాగం కూడా బాగా నవ్వించింది. ఆ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇప్పుడు సీక్వెల్ లో కామెడీ ఫస్ట్ పార్ట్ కు మించి ఉందన్నది రివ్యూల మాట. ప్రేక్షకులూ అదే ఫీల్ అవుతున్నారు. మహేష్ బాబు, చిరంజీవి లాంటి బడా స్టార్లకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. ఈమధ్య కాలంలో ఇంతలా నవ్వింది లేదంటూ స్వయంగా చిరంజీవి కాంప్లిమెంట్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా సత్య ఈ సినిమాతో మ్యాజిక్ చేశాడు. ఇది వరకు కూడా సత్య చాలా సినిమాల్లో నవ్వించాడు. అయితే ఈ సినిమాలో తనే హీరో అయిపోయాడు. ఈ దెబ్బతో సత్యని దృష్టిలో ఉంచుకొని కొత్త పాత్రలు సృష్టించడం ఖాయం.
నిజానికి కామెడీ చిత్రాలకు సీక్వెల్స్ రావడం చాలా అరుదు. మనీ తరవాత మనీ – మనీ వచ్చింది కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఆ మ్యాజిక్ ‘మత్తు వదలరా’ చేసింది. ఈ ఫ్రాంచైజీ మున్ముందు కూడా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. త్వరలో రాబోతున్న కామెడీ చిత్రాలకు ‘మత్తు వదలరా 2’ బూస్టప్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా శ్రీవిష్ణు ‘స్వాగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా కామెడీని నమ్ముకొన్న సినిమానే.