మన దగ్గరకు వచ్చిన జనం అంతా మనకు ఓట్లేస్తారనుకోవడం భ్రమేనని తేల్చిపారేశారు ఎపి మంత్రి ఆదినారాయణరెడ్డి. జగన్ సభలకు, పాదయాత్రకు జనం భారీగా హాజరవుతున్నారన్నదానిపై ఆయన స్పందిస్తూ… ఆ వచ్చేవాళ్లంతా ఓట్లేయరన్నారు. మన ఇంట్లో పెళ్లిళ్లకు, మనం పెట్టే మీటింగులకు జనం బాగానే వస్తారని వ్యంగ్యోక్తులు విసిరారు. గతంలో రఘువీరా, బొత్సల ఇంట పెళ్లిళ్లు జరిగాయని, ఆ పెళ్లిళ్లకు జనం భారీగా వచ్చారని అయితే ఎన్నికల్లో వారిద్దరికీ డిపాజిట్లు కూడా రాలేదంటూ ఆయన ఉదాహరణ కూడా చెప్పారు.
ఆది కామెంట్ విన్నవారికి కాస్త విచిత్రంగా అనిపించింది. బహిరంగ సభల్లో వచ్చే జనం అంతా ఓట్లేయరు అనేది ఆది చెప్పకముందే అందరికీ తెలిసిందే. సభలకు వచ్చే జనమే ఓట్లను వేసే లెక్కయితే గతంలో ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చి ఉండేది. అంతెందుకు తాజాగా నంద్యాలలో సైతం వైసీపీయే గెలిచుండేది.
సభలకు జనం రావడానికి ఎన్నికల్లో గెలుపోటములకు సంబంధం లేదని ఎన్నోసార్లు రుజువైంది. అయితే మధ్యలో ఈ పెళ్లి పేరంటాలు ఎందుకొచ్చాయో, ఈ బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టడం ఏమిటో మంత్రిగారికే తెలియాలి. ఈ మాటలతో పాటు … ప్రస్తుతం అసెంబ్లీకి వైసీపీ హాజరు కాకపోవడాన్ని గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం చాలా బావుంది అంటూ ఆనందాన్ని వ్యక్త పరిచారు. ప్రజాసమస్యలు శాసనసభలో ప్రస్తావించాల్సిన బాధ్యతను విస్మరించి ఇప్పటికే వైకాపా విమర్శలు ఎదుర్కుంటోంది. దీనికి తగ్గట్టే మంత్రి గారు కూడా ప్రతిపక్షం లేకపోవడమే బాగుంది అనడంతో దొందూ దొందే అన్నట్టుంది.
అథికారపక్షానికో, ప్రతిపక్షానికో ఆయా పార్టీల శాసనసభ్యులకు బాగుండడం, లేదా బాగోలేకపోవడం గురించో కాదు కదా అసెంబ్లీ ఉన్నది…. దీన్నిఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు గుర్తించకపోవడం ఆ రాష్ట్ర ప్రజల దురదృష్టం అనే చెప్పుకోవాల్సి వస్తోంది.