న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో పకడ్బందీగా జరిగిన దాడి విషయంలో సీబీఐ సంచలన విషయాలు కనుగొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. చార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. మరికొన్ని కీలక అరెస్టులు త్వరలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా న్యాయవ్యవస్థపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలేనని తేలింది. అదే సమయంలో పదుల సంఖ్యలో ఫేక్ అకౌంట్లలో కూడా పోస్టులు దర్శనమిచ్చాయి. ఆ పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా వచ్చాయి.. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు
వంటి అంశాపై సీబీఐ విచారణ చేపట్టి కీలకమైన విషయాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రధాన కార్యాలయం… వైసీపీ సోషల్ మీడియా డిజిటల్ టీంతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులే ఈ పేజీలను ఆపరేట్ చేస్తున్నారని.. అంతా వ్యూహాత్మకంగా జరిగిందనేదానికి సీబీఐ అధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. గతంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ దేవందర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్ట్ చేస్తున్నారు.
ఈ ప్రక్రియ అంతా ఓ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా జరిగిందనే అనుమానాన్ని గతంలో సీబీఐ వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడుల విషయంలో సీబీఐ సరిగ్గా పట్టించుకోడం లేదన్న సుప్రీంకోర్టు ఆగ్రహం నేపధ్యంలో సీబీఐకూడా.. ఈకేసు విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని.. అసలు సూత్రధారిని కనిపెట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ వైసీపీలో కలకలం రేపుతోంది.