రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు బుక్కులు పెట్టుకుంటున్నాయి. ఒక్కో కలర్ ను ఎంచుకుంటున్నాయి. ఆ బుక్కుల పేరుతో బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ రాను రాను ఈ బుక్కుల వ్యవహారం కామెడీ అయిపోతోంది. ఇవన్నీ బెదిరించేందుకు తప్ప నిజానికి వర్కవుట్ కావని అందరూ ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. చివరికి ప్రజలు కూడాం బుక్కుల రాజకీయాల్ని కామెడీగానే తీసుకుంటున్నారు.
రెడ్ బుక్ తో ట్రెండ్ సెట్ చేసిన లోకేష్
వైసీపీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజ్యాంగం, చట్టం అనేవి అక్కడ అమలు కాలేదు. సోషల్ మీడియా కేసుల్లో అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయేవారు. చివరికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునూ వదిలి పెట్టలేదు. ఆయనను ఇరికించేందుకు తప్పుడు పత్రాలు కూడా సృష్టించారని బయటపడింది. అందుకే ఎవర్నీ వదిలి పెట్టనని అందరి పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని లోకేష్ ప్రకటించారు. ఆ బుక్ ట్రెండ్ సృష్టించిది. ఎంతగా అంటే ఎన్నికలకు ముందు ఆ బుక్ ను హేళన చేసిన వైసీపీ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని వణికిపోతోంది.
గుడ్ బుక్ అంటూ జగన్ ప్రయత్నాలు
జగన్మోహన్ రెడ్డి బయటకు చెప్పరు కానీ ఆయన జైలుకెళ్లిప్పుడు ఇలాంటి బుక్ రాసుకుని ఉంటారు. మనీ సినిమాలో బ్రహ్మానందం.. జైలు గోడల మీద.. ఎవరెవర్ని చంపారో రాసుకుంటారు. అలా జగన్ కూడా జైల్లో ఉన్నప్పుడు అలా గోడల మీద రాసుకున్నారేమో కానీ అచ్చెన్న నుంచి చంద్రబాబు వరకూ అరెస్టు చేయించుకున్నారు. ఇప్పుడు అధికారం పోయేసరికి..పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయడం ఆపేసేసరికి.. గుడ్ బుక్ రాసుకుని అందరికీ మేలు చేస్తానని ఆశ పెడుతున్నారు. ఈ గుడ్ బుక్ లో పేర్లు ఎవరివి ఉంటాయంటే…అధికార పార్ట్ నేతల్ని బూతులు తిట్టిన వారివే ఉంటాయని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణలోనూ బుక్కుల రాజకీయం
ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా ఓ. బుక్ రాసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన ప్రకటించారు. అందరి పేర్లు రాశానని వచ్చాక సంగతి చూస్తానన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆ బుక్ ప్రస్తావన గెలిచిన తర్వాత తీసుకురాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆ పని చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ రాసుకుంటున్నారు. అందరి ఎదురుగానే ఆయన అందులో పేర్లు రాస్తున్నారు. కవిత పింక్ బుక్ రాసుకుంటానంటున్నారు. ఇలా అందరూ బుక్కుల పేరుతో బెదిరించేస్తున్నారు.అందుకే ఇదో కామెడీ అయిపోతోంది.