వైయస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే మాటలు ప్రజలపై చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలు పూర్తి సమాచారం తో నిండి ఉంటాయని ప్రజలు భావిస్తారు. అయితే రాజకీయ నాయకులు మాట్లాడే మాటల లో అవగాహన రాహిత్యం కనిపిస్తే మాత్రం నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటారు. ప్రస్తుతం జగన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో ఇదేవిధంగా తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
ఆ మధ్య బీకాం లో ఫిజిక్స్ చదివాను అంటూ వ్యాఖ్యలు చేసి జలీల్ ఖాన్ అనే ఎమ్మెల్యే సోషల్ మీడియాలో నవ్వులపాలైన సంగతి తెలిసిందే. సీఎం జగన్ అప్పుడప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆ స్థాయిలో కాకపోయినా ఒక రేంజ్ లో నవ్వుల పాలు అవుతున్నాయి. దిశ ఉదంతం జరిగిన కొత్తలో, ఆమె టూవీలర్ కోసం టోల్ గేట్ వద్ద టోల్ డబ్బులు కట్టడానికి వెళ్ళినప్పుడు అత్యాచార సంఘటన జరిగిందని సాక్షాత్తూ అసెంబ్లీ లో జగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యాయి. ద్విచక్ర వాహనాలకు టోల్ రుసుము ఉండదు అన్న సంగతి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కి తెలియకపోవడం శోచనీయం అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా జగన్ పెట్టిన ప్రెస్ మీట్ అనంతరం కూడా ఇదే తరహా ట్రోలింగ్ జరుగుతోంది.
ముఖ్యంగా ఒక పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి. చైనా దేశస్తులు, ఇంత చిన్న పారాసిటమాల్ మాత్రలు ఈ వైరస్ తగ్గుతుందని తెలియక మేము చాలా ప్రాణాలు పోగొట్టుకున్నాము అన్నట్లుగా వాపోతూ జగన్ ను కీర్తిస్తున్నట్లుగా చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పైగా బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే కరోనా దరిచేరదని జగన్ చేసిన వ్యాఖ్యల మీద కూడా నెటిజన్లు కామెడీ చేస్తున్నారు. కరోనా వస్తే చనిపోతారు అన్నది అవాస్తవం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మీద కూడా సెటైర్లు పడుతున్నాయి. పైగా కేవలం అరవై ఏళ్ళ పైబడ్డ వారిపై మాత్రమే ఈ వైరస్ ప్రభావం ఉంటుంది అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలను సైతం నెటిజన్లు చెడుగుడు ఆడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ లో మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా కామెడీ అవుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన దానికి కానిదానికి తరచుగా ప్రెస్మీట్లు పెట్టేవారు. ఆయన తో పోలిస్తే చాలా తక్కువ సార్లు జగన్ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ఆ తక్కువ ప్రెస్ మీట్ ల లో మాట్లాడుతున్న మాటల్లో కూడా అవగాహన లేమి బయటపడడం ట్రోలింగ్ కు కారణం అవుతుంది. బీకాం ఫిజిక్స్ తో జగన్ పోటీ పడుతున్నాడు అంటూ విపక్ష పార్టీల అభిమానులు చేసిన వ్యాఖ్యలకు వైకాపా అభిమానులు సైతం సమాధానం ఇవ్వలేక పోతున్నారు. మొత్తం మీద జగన్ తరచుగా అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నాడు అన్న విమర్శలను వైఎస్ఆర్సిపి ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.