సైరా చారిత్రక చిత్రం. ఓ యోధుడి కథని సినిమాగా మలిచారు. ఓరకంగా బయోపిక్. ఇలాంటి కథల్లో కమర్షియాలిటీ అంశాలు తక్కువగా ఉంటాయి. వాస్తవ చిత్రణపై ఫోకస్ పెట్టిన ప్రతీ కథా కమర్షియల్అంశాలకు దూరంగానే ఉంటుంది. కాకపోతే `సైరా` విషయంలో మాత్రం చిరంజీవి అండ్ కో తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సైరాని పక్కా వాణిజ్య చిత్రంగా మలిచేందుకే తపన పడినట్టు సమాచారం. ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితాన్ని కేవలం అవుట్లైన్గా మాత్రమే తీసుకున్నారని, దాని చుట్టూ పక్కా కమర్షియల్ సినిమాని నడిపించారని చెబుతున్నారు. ఓ పాట,ఓ ఫైటు, హీరోయిజం అన్నది చిరు సినిమాల ఫార్ములా. సైరా కూడా ఇంచుమించుగా ఇలానే సాగబోతోందని టాక్.
ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథ ఇది అనేది పక్కన పెట్టినా – గతంలో చిరంజీవి సినిమా చూసినట్టే సైరా సాగబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఉయ్యాలవాడ వంశస్థుల నుంచి ముప్పు పొంచి ఉంది. సినిమా చిత్రీకరణ సమయంలోనే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లంతా సినిమా చూసి ఏమంటారన్నది ఆసక్తిగా మారింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథని వక్రీకరించారని వాళ్లంతా నిరసన గళం విప్పే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ గొడవ కోర్టులో ఉంది. కోర్టు తీర్పు ఏదైనా సరే, విడుదలకు ముందే ఉయ్యాల వాడ వంశస్థులతో కూర్చుని మాట్లాడుకుని, ఓ సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందని `సైరా` టీమ్ భావిస్తోంది. కోట్లలో పెట్టి తీసిన సినిమా ఇది. ఏమాత్రం చిన్న ఆటంకం కూడా రాకూడదు. అందుకే.. ఆ వైపు నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం.