ఎపి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులపై ఆంక్షలు పెరగడం విమర్శలకు కారణమవుతున్నది. సమీకరణ కింద వచ్చింది గాక ఇంకా భూమి కావాలంటే సేకరణ పద్ధతి అనుసరించాల్సిందే. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం వారు పరిహారం పొందాలంటే అనేక పత్రాలు కావలసి వస్తున్నది. ఈ ఘట్టంలోనూ వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వమే అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చిపెడుతున్నది. భూములు విక్రయించుకోవడానికి వీల్లేకుండా రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది.. భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో సమస్యలు రాకుండా చూడటానికే ఈ నిషేదం అనిచెబుతున్నారు.
రాజధాని రైతులు ప్రతి అవసరాలనికి సిఆర్డిఎ కార్యాలయాలకు వెళ్లి నిరభ్యంతరపత్రం (ఎన్ఓసి) తెచ్చుకోవలసిన అగత్యమేర్పడుతున్నది. వాటిని జారీ చేయడానికి అనేకానేక ఆంక్షలుంటాయి. భూమి ఇచ్చిన సమయంలోసిఆర్డిఎ ఇచ్చిన రశీదు, ఆడంగల్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు, సిఆర్‌డిఎకు ఇచ్చాక మళ్లీ ి విక్రయించలేదంటూ అఫడవిట్ సమర్పించాలి. తమ భూమిని ఇచ్చి తామే ఇన్ని విధాల ఆధారాలు ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత రైతులపై పడటం ఒక విచిత్రం. కాగా అవన్నీ ఇచ్చినా అదనపు కమిషనర్ సంతృప్తి మేరకే ఎన్ఓసి జారీ చేయొచ్చు చేయకపోవచ్చు. ఏదో ఒక సాకుతో ప్లాట్లు కేటాయింపులు పూర్తయ్యే వరకూ ఎవరికీ ఎన్ఓసి కూడా ఇవ్వకూడదని సిఆర్డిఎ అధికారులకు అంతర్గత ఆదేశాలున్నట్టు కూడా చెబుతున్నారు.
ే ప్రభుత్వం పదివేల ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి రైతులకు కేటాయించడంతో భూముల రేట్లు అందుబాటులోకి వస్తాయని క్రిడా కమిషనర్ శ్రీకాంత్ ప్రకటించారు. త్వరలోనే నేలపాడులో ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఆ పాట్ల కేటాయింపు తర్వాత అక్కడ చదరపు గజం లక్షన్నర వున్న పరిస్థితి పోయి యాభైవేలకు తగ్గుతుందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అంటే రైతుల చేతుల్లోకి ప్లాట్లు వచ్చేసరికి ధరలు పడిపోతాయని అధికారికంగానే చెప్పడంపై ఆశాభంగం చెందుతున్నారు. తమ దగ్గర వున్న భూమిని కట్టడి చేసి ధరలు నేలకు దించిన తర్వాత లాభపడేదేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భూమిపై లాభాలు మీకే చెందాలన్నది నా ఉద్దేశం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు గుర్తుచేస్తున్నారు. మరి సర్కారు వ్యూహంలో మతలబులేమిటో చూడాల్సిందే.