హైదరాబాద్: రోజా సస్పెన్షన్పై ఏర్పాటైన కమిటీ ఆమె ప్రవర్తన సరిగా లేదని నిర్ధారించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జ్యోతుల నెహ్రూ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. కమిటీ ఇవాళ హైదరాబాద్లో అసెంబ్లీ కార్యాలయంలో సమావేశమయింది. ఈ కమిటీలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ నివేదికను ముందు ఎథిక్స్ కమిటీకి, ఆ తర్వాత ప్రివిలేజ్ కమిటీకి సమర్పించనున్నారు.
మరోవైపు ఈ కమిటీ నివేదికపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం వైసీపీపై బురదజల్లే ఎజెండాతో బుద్ధప్రసాద్ కమిటీ నివేదిక రూపొందించిందని ఆరోపించారు. వీడియో లీకేజ్ అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా స్పందించలేదని చెప్పారు. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిస్సెంట్ నోటీసును ఇచ్చినట్లు తెలిపారు. ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోలను విడుదల చేశారని ఆరోపించారు.