పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ హయాంలో ఓ సారి పనులు మధ్యలో ఉండగానే ప్రీక్లోజర్ చేసేశారు. అంటే కాంట్రాక్ట్ సంస్థలన్నింటినీ వెళ్లగొట్టేశారు. కమిషన్ల కోసమే ఇలా చేశారని టీడీపీ నేతలు పోలవరం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆరోపిస్తూ ఉంటారు. అయితే.. ప్రీ క్లోజర్ వల్ల నష్టపోయిన కాంట్రాక్ట్ సంస్థలు అప్పట్లో కోర్టును ఆశ్రయించాయి. పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ వివాదం కోర్టులో ఉంది. వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీని నియమించాలని హైకోర్టు సూచించింది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందానికి రావాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
కమిటీని నియమించి మూడు నెలల వ్యవధిలో ఓ పరిష్కారం కనుగొనేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. నిజానికి హైకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు మాజీ జడ్జి కాదు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేసి… ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఆదేశించింది. అయితే హైకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బెటర్ అనుకుందేమో కానీ ప్రభుత్వం అదే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి కాలంలో ఏపీ సర్కార్కు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు సన్నిహితంగా ఉంటున్నారు.
బహుశా.. ఆయనకు ఆ బాధ్యత అప్పగించే ఉద్దేశంతోనే హైకోర్టు మాజీ న్యాయమూర్తి అని హైకోర్టు చెప్పినప్పటికీ.,. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అని ఉత్తర్వులు జారీ చేశారని భావిస్తున్నారు. అప్పట్లో ప్రీక్లోజర్ ఏ కారణంతో చేశారో కానీ ఆ సంస్థలు భారీ నష్టపరిహారం కోరుతున్నాయి. ఎంత నష్టపరిహారం ఇస్తే అంత.. వైఎస్ కాలం నాటి పోలవరం వ్యవహారాలు చర్చకు వస్తాయి కాబట్టి.. ఆనాటి కాంట్రాక్ట్ సంస్థలకు కొత్తగా ఏమైనా కాంట్రాక్టులు ఇచ్చి ఏ పరిహారం వద్దని స్టేట్మెంట్ తీసుకునే అవకాశాల్ని కూడా కొట్టి పారేయలేమని రివర్స్ టెండరింగ్ వ్యవహారాలను పరిశీలిస్తున్న నిపుణులు అంచనా వేస్తున్నారు.