భారతదేశంలో ఏదయినా ఒక కుంభకోణం బయటపడినప్పుడు, మీడియాలో చాలా హడావుడి మొదలయిపోతుంది కానీ అది కొన్నాళ్ళే ఉంటుంది. మీడియాకి మళ్ళీ మరో ఆసక్తికరమయిన అంశం దొరకగానే దానికి షిఫ్ట్ అయిపోతుంది. దానితో బాటే ప్రతిపక్షాలు, ప్రజలు కూడాను. ప్రస్తుతం ‘పనామా పేపర్స్’ బాగోతం నడుస్తోంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రోజుకో జాబితా విడుదల చేయడం, ఆ జాబితాలో ఉన్న ఐశ్వర్యా బచ్చన్ వంటి వాళ్ళు ఆ లీకులని ఖండించడం షరా మామూలుగా అంతా పద్ధతి ప్రకారం జరిగిపోతోంది.
దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “విదేశాలలో నల్లదనం దాచుకొన్నవారికి దానిని బయటపెట్టేందుకు మా ప్రభుత్వం చాలా అవకాశమే కల్పించింది. మా చేతికి చిక్కిన జాబితాలలో పేర్లున్నవారిపై కేసులు నమోదు చేసి విచారణ కూడా మొదలుపెట్టాము. ఇప్పుడు దీనిపై కూడా దర్యాప్తు చేసి దోషులు ఎంత పెద్దవారయినా కటినంగా శిక్షిస్తాము. దీని గురించి నేను ప్రధాని నరేంద్ర మోడితో నిన్న మాట్లాడాను. నా సూచన మేరకు ఆయన దీనిపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటిని నియమించడానికి ఒప్పుకొన్నారు. దానిలో సి.బి.డి.టి.,ఎఫ్.టి.& టి.ఆర్., ఆర్.బి.ఐ. మరియు ఎఫ్.ఐ.యు.లకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. పనామా పేపర్స్ జాబితాలో పేర్లున్నవారందరి ఆర్ధిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలపై వారు దర్యాప్తు చేసి, దోషులను గుర్తిస్తారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ లో సుమారు 500మందికి పైగా భారతీయులు విదేశాలలో అక్రమంగా నల్లదనం దాచారని పేర్కొంది. దేశానికి ఉపయోగపడే ఇటువంటి పరిశోధనాత్మక జర్నలిజం చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చాలా పారదర్శకత పాటించడానికి మొగ్గు చూపుతున్నాయని, ఇటువంటి అక్రమలావాదేవీల గురించి సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయని నేను పదేపదే చెపుతున్నాను. అయినా కూడా నేటికీ చాలా మంది ఇటువంటి తప్పులు చేస్తూనే ఉన్నారు. అటువంటి వారిపట్ల మా ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తుంది,” అని చెప్పారు.
విదేశాలలో నల్లదనం దాచిన వారి పేర్లను కూడా బయటపెట్టడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఎందుకంటే బహుశః వారికున్న రాజకీయ పలుకుబడి, ప్రభుత్వాధినేతలతో సంబంధాలు కారణంగానేనని చెప్పవచ్చును. వారి వ్యాపార ప్రయోజనాలు, కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే కేంద్రప్రభుత్వం తన చేతికి చిక్కిన నల్లకుబేరులపై గుట్టుగా చర్యలు చేపడుతోందని భావించవలసి ఉంటుంది. మరి అటువంటప్పుడు వారిపట్ల ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తోందని జైట్లీ ఏవిధంగా చెప్పుకొంటున్నారు? వారి పట్ల అంత జాగ్రత్తలు పాటిస్తున్న ప్రభుత్వం చట్ట ప్రకారం వారిని శిక్షిస్తోందంటే నమ్మశక్యంగా లేదు. బహుశ ఈ ‘పనామా కధ’ కూడా ఏదో ఒకరోజు అలాగే ముగియవచ్చును.