Committee Kurrollu movie review
తెలుగు360 రేటింగ్: 2.75/5
అంబేద్కర్ విగ్రహం, పదకొండు మంది స్నేహితులు, జాతరకి కట్టే జెండాలు, వెలుగునిచ్చే టార్చ్… ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా పోస్టర్ లో కనిపించిన ఎలిమెంట్స్ ఇవి. మరి ఈ ఎలిమెంట్స్ వెనుక ఎలాంటి కథ దాగుంది? అంతా కొత్తవారితో మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో తీసిన కమిటీ కుర్రోళ్ళు ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని పంచగలిగిందా?
కోనసీమలో పురుషోత్తంపల్లె. ఈ ఊరిలో ప్రతి 12 ఏళ్లకు గ్రామదేవత భరింకాలమ్మ జాతర వైభవంగా జరిపిస్తుంటారు. బలిచేట మోసే సత్తయ్య (కంచెరపాలెం కిషోర్) ఈ జాతరకు కీలకం. ఆయన చేతుల మీదగానే ఈ క్రతువు జరగాలి. అయితే అనుకోని కొన్ని పరిస్థితుల వలన సత్తయ్య ఆ గ్రామం విడిచివెళ్లిపోతాడు. జాతర జరగాలంటే సత్తయ్య మళ్ళీ రావాలి. సత్తయ్యని తీసుకొచ్చే బాధ్యత ఆ వూర్లో కొందరు కుర్రాళ్ళు తీసుకుంటారు. మరి సత్తయ్యని వెనక్కి తీసుకొచ్చారా? అసలు సత్తయ్య ఊరు విడిచి వెళ్ళడానికి కారణం ఏమిటి? సత్తయ్యని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ఆ కుర్రాళ్ళే ఎందుకు ముందుకు వచ్చారు? ఈ కథలో బుజ్జి (సాయికుమార్) పాత్ర ఏమిటి? ఫైనల్ గా ‘కమిటీ కుర్రోళ్ళు’ జాతర జరిపించారా లేదా ? అనేది తక్కిన కథ.
‘ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా కొట్టుకుచచ్చే పరిస్థితి మన సిస్టమే క్రియేట్ చేసింది’ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ఇది. చాలా సీరియస్ పాయింట్ ఇది. తమిళ్ లో పా.రంజిత్, వెట్రిమారన్ లాంటి డైరెక్టర్స్ ఇలాంటి కథలని రా అండ్ రస్టిక్ గా చాలా డీప్ లేయర్ లో చూపిస్తుంటారు. కొత్త దర్శకుడు యదు వంశీ ఈ పాయింట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మై అటోగ్రాఫ్ స్వీట్ మోమోరీస్ తరహాలో చెప్పే ప్రయత్నం చేశాడు.
సినిమా ప్రారంభంలోనే ఊర్లో జాతర జరపాలి, దీని తర్వాత ప్రెసిడెంట్ ఎన్నికలు జరగాలనే రెండు పాయింట్లుని ఎస్టాబ్లెస్ చేస్తారు. తర్వాత కథ శివ(సందీప్ సరోజ్) కోణంలో 90’s ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. బాల్యం నుంచి స్నేహితులందరూ సరదాగా గడిపిన రోజులు, మధురమైన క్షణాలు, ప్రేమలు ఇవన్నీ కూడా ఊర్లలో పుట్టిపెరిగిన వారికి పర్శనల్ గా కూడా కనెక్ట్ అవుతాయి. తర్వాత కథ ఒక్కసారిగా అనూహ్యమైన మలుపుని తీసుకుంటుంది. నిజానికి ఇలాంటి షిఫ్ట్ కి ఆడియన్స్ ప్రిపేర్ గా వుండరు. అదంతా కొంచెం ఫోర్స్ ఫుల్ గా అనిపిస్తుంది. ఇలాంటి కథని డీల్ చేసినప్పుడు బిగినింగ్ నుంచే కొన్ని సీన్లు వేసుకుంటూ వచ్చినట్లయితే ఆ షిఫ్ట్ ఇంకాస్త ఆర్గానిక్ గా వుండేది.
రిజర్వేషన్స్, కులాల మధ్య కుమ్ములాట సెన్సిటివ్, కాంప్లెక్స్ టాపిక్స్. వాటిని ఒక ఫ్రెండ్షిప్ కథలో డీల్ చేయడం అంత తేలిక కాదు. దాన్ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు కూడా. కాకపోతే ఇంటర్వెల్ వరకూ అసలు కథని మొదలుపెట్టకుండా మెమొరీస్ తో టైం పాస్ చేసి ఇంటర్వెల్ కి ముందు హడావిడిగా ఇలాంటి సీరియస్ టర్న్ తీసుకోవడం కథలో అంత సహజంగా కూర్చోలేదు.
ఇంటర్వెల్ తర్వాత ఈ కథ పూర్తిగా షిఫ్ట్ అయిపోతుంది. 12 ఏళ్ళు ఆ కుర్రాళ్ళంతా ఊరికి దూరంగా వెళ్లిపోయారనే కోణంలో కథనం ముందుకు నడిపారు. దీంతో అప్పటివరకూ వున్న ఓ కోర్ ఎమోషన్ సడన్ గా పట్టుకోల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది. రిజర్వేషన్స్ కారణంగా కొంతమంది స్నేహితుల మధ్య గొడవలు వచ్చాయనే పాయింట్ మాత్రమే దర్శకుడి దగ్గరవుంది. ఈ పాయింట్ చుట్టూ అతను అల్లుకున్న కాన్ఫ్లిక్ట్ అంత బలంగా నిలబడలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే కంచెరపాలెం కిషోర్ ఎపిసోడ్ మాత్రం ఎమోషనల్ గా వుంటుంది. అయితే జాతర ఘట్టానికి మొదట ఎంత ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు చూపించి చివరికి అది సింపుల్ గా తేల్చేశారు.
జాతర తర్వాత వచ్చే ఎన్నికల ఎపిసోడ్ నిజానికి ఈ కథకు అవసరం లేదు. దీన్ని జాతర కథగానే ముగించాల్సింది. ఆ ఎన్నికల హంగామా అంతా వృధా ప్రయాస అనిపిస్తుంది. నిజానికి అప్పటికే ప్రేక్షకుడు ఇక చాల్లే అనీ ఫీలింగ్ కి జారుకొని ఉంటాడు. కానీ ఫోర్స్ ఫుల్ గా దాదాపు ఇరవై నిముషాలు ఎన్నికల ఎపిసోడ్ నడిపారు. ప్రెసిడెంట్ స్పీచ్ అయితే మరీ రొటీన్ వ్యవహారంలా తయారైయింది. ఎన్నికల్లో డబ్బులు పంచే ఎపిసోడ్ సోషల్ మీడియా వీడియోస్ ని గుర్తుకు తెస్తుంది. ఇక ఇదంతా చాలనట్టు చివరికి ఓ గెట్ టూ గెదర్ ఎపిసోడ్ కూడా పెట్టుకున్నారు. ఇదంతా తెరపై చూస్తున్న ఆడియన్ కి ‘ఇంత చాదస్తం ఏంట్రా బాబు’ అని ఫీలింగ్ రాకమానదు.
ప్రసాద్ తప్పితే లీడ్ రోల్స్ లో చేసిన నటీనటులంతా కొత్తవారే. ఇది మంచి ప్రయత్నమే. అయితే తెరపై ఇంత మంది కొత్తవారిని చూసి వారి పాత్రలని రిజిస్టర్ చేసుకోవడం ఆడియన్స్ కి ఒక టాస్క్. శివగా సందీప్ సరోజ్ సూర్యగా యశ్వంత్ పెండ్యాల, విలియంగా ఈశ్వర్, సుబ్బుగా త్రినాధ్ వర్మ, ఆత్రంగా లోకేష్ నటన బావుంది. ప్రసాద్ తో పాటు మిగతా నటీనటులు రెండు టైమ్ లైన్స్ లో కనిపిస్తారు. ఆ రెండు కాలాలలో వేరియెషన్ చూపించే తీరు బావుంది. ఆ ఎఫర్ట్ తెరపై కనిపించింది. మాధురిగా రాధ్య, జ్యోతిగా తేజస్వీ రావు, శ్రీదేవిగా టీనా శ్రావ్య ముచ్చటగా కనిపించారు. సాయి కుమార్ కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి. కిషోర్ ప్రీక్లైమాక్స్ ఆకట్టుకునే నటన కనబరిచాడు.
టెక్నికల్ గా సౌండ్, కెమెరాపనితనం బావున్నాయి. అనుదీప్ దేవ్ పాటల్లో చైల్డ్ వుడ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సాంగ్ ఆకట్టుకుంతుంది. నేపధ్య సంగీతం ఎంగేజింగా చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో కుర్రాళ్ళు గొడవపడే సీన్ లో తను ఇచ్చిన నేపధ్య సంగీతం తర్వాత కథపై అంచనాలు పెంచేస్తుంది. అయితే స్కోర్ చేయడానికి అలాంటి మరో బలమైన సీక్వెన్స్ పడలేదు. రాజు విజువల్స్ ఆహ్లాదకరంగా, అలనాటి రోజులని గుర్తుకు తెస్తాయి. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు వున్నాయి. కొన్ని ఆకట్టుకునే మాటలు రాశారు.
డైరెక్టర్ కి మంచి విజువల్స్ సెన్స్ వుంది. ముఖ్యంగా మోమోరిస్ ఫోర్షన్ ని బాగా రాసుకున్నాడు. అలనాటి జ్ఞాపకాలని ముడిపెడుతూ కమిటీ కుర్రోళ్ళు ని అందరి బియోపిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ పాత్రలని, కథని మలిచిన తీరులో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. మొత్తంగా ఈ కుర్రాళ్లు 1980ల నాటి జ్ఞాపకాల్ని మళ్లీ మరోసారి గుర్తు చేశారు. జ్ఞాపకాల జాతర జరిపించారు. ఓసారి హాయిగా చూడదగ్గ కంటెంట్ ఈ సినిమాలో ఉంది.
తెలుగు360 రేటింగ్: 2.75/5