గత ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు శత్రుదేశాల కంటే ఘోరంగా కీచులాడుకొంటుంటే, కేంద్రప్రభుత్వం కలుగజేసుకొని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలా తనకు పట్టనట్లు కూర్చొంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య కొంత సయోధ్య ఏర్పడినందున ఆ వివాదాలను వాటంతట అవే స్వయంగా పరిష్కరించుకొనే పరిస్థితిలో ఉన్నపుడు కేంద్రప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని సోమవారం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమీషనర్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖ కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి, తెలంగాణ ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణ రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి రెండు నెలల గడువు విధించారు. కేంద్ర పరిపాలనా సిబ్బంది శాఖ కార్యదర్శి కొఠారి ఇదే పనిమీద మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ కమిటీలో సభ్యులు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో రేపు ఆయన సమావేశమవుతారు.