సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల దేశంలో కెల్లా ఎక్కువగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఎనిమిది శాతానికిపైగా నమోదైంది. కర్ణాటకలో ఇది ఆరు శాతం వరకే ఉంది. తెలంగాణలో ఏడు శాతం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారీ మెట్రో సిటీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మెట్రో సిటీలు లేకపోయినప్పటికీ…ధరల పెరుగుదలలో మాత్రం ఆ రెండు రాష్ట్రాలను మించి పోయింది. మినిస్ట్రి ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గణాంకాలు దీన్ని నిర్ధారిస్తున్నాయి.
భారతదేశంలో గత ఏడాది కరోనా లాక్ డౌన్ తర్వాత అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయాయి. ఒక్క నిత్యావసర వస్తవువులే కాదు.. భవన నిర్మాణ సామాగ్రి సహా ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయాయి. అయితే ప్రజల జీవన ప్రమాణాల్ని ఎక్కువగా నిర్దేశించేది నిత్యావసర వస్తువుల ధరలే. అవి పెరిగితే.. ప్రజల జీవన ప్రమణాలు పడిపోతాయి. తాము తినే ఆహారంలో క్వాలిటీ తగ్గించుకుంటారు. ఆ ప్రభావం భవిష్యత్‌పై పడుతుంది. దేశంలో ధరల పెరుగుదలను పరిశీలించేందుకు ఓ వ్యవస్థ ఉంది. ఎప్పటికప్పుడు.. ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో… గుర్తించేందుకు డాటాను సమీకరించి రిపోర్ట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదికలను విడుదల చేస్తూంది. ఈ సంస్ధ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో ఆహారపదార్ధాలకు ఎక్కువ ధరలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. సాధారణంగా పండే చోట రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ ఏపీలో అనూహ్యంగా ఎక్కువగా ఉంటున్నారు. అంతే కాదు.. ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి. అంటే వ్యాపారులు ఇష్టారీతిన దోచుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ అలాంటి ప్రయత్నాలేమీ జరగకపోవడంతో.. ఏపీ ప్రజలపై ధరల భారం పెరిగిపోతోంది.ప్రభుత్వం కట్టడి చేయకపోతే.. దేశంలోనే ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.