పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి వామపక్ష కూటమి సర్వ శక్తులూ ఒడ్డి పోరాడేందుకు సద్ధమైంది. ఇందుకోసం రాజీ పడటానికి కూడా రెడీ అయింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఉమ్మడిగా ప్రచాం చేయకపోయినా, సీట్ల సర్దుబాటు మాత్రం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.
శారదా స్కామ్, నారద టీవీ స్టింగ్ ఆపరేషన్, ఐదేళ్ల మమతా బెనర్జీ పాలనలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడం వంటి అంశాలన ప్రజల్లోకి తీసుకెళ్లి, పోగొట్టుకున్న కంచుకోటను తిరిగి దక్కించుకోవడానికి సీపీఎం తహతహలాడుతోంది. సుదీర్ఘ చర్చలు, అనూహ్య మలుపుల తర్వాత కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది.
మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ 88 సీట్లకు పోటీ చేస్తుంది. స్థానికంగా దాని మిత్రపక్షమైన మరో చిన్న పార్టీ 2 సీట్లలో పోటీ చేస్తుంది. 8 సీట్లలో లెఫ్ట్ కూటమి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను పోటీకి పెట్టకూడదని నిర్ణయించాయి. అక్రాంతో ఆర్మా (మేం బాధితులం), గూర్ఖా జన ముక్తి మోర్చాలు ఆ సీట్లలో పోటీ చేస్తాయి. మిగిలిన 189 సీట్లలో కమ్యూనిస్టు పార్టీలు పోటీకి దిగుతాయి. అయితే, 7 సీట్లలో కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య స్నేహ పూర్వక పోటీ అనివార్యంగా మారింది.
బెంగాల్ చరిత్రలో ఇది ఊహంచని పరిణామం. ఉప్పు నిప్పు లాంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టుకోవడం కలలో కూడా ఊహించని విషయం. అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొని, తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించాలంటే సొంత బలం చాలదని లెఫ్ట్ కూటమి భావించినట్టుంది. రాష్ట్రంలో ఎంతో కొంత స్థిరమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు కలిసి వస్తుందని కామ్రేడ్లు అంచనాకు వచ్చారు.
34 ఏళ్ల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన నాయకురాలిగా మమతా బెనర్జీకి పేరుంది. మొదట జ్యోతి బసు, ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య సుదీర్ఘంగా ముఖ్యమంత్రులుగా కొనసాగారు. గత ఎన్నికల్లో కామ్రేడ్లపై విరుచుకు పడిన మమత, అంతకు చాలా ముందు నుంచే స్కెచ్ వేశారు. సెజ్ ల పేరుతో, పారిశ్రామిక వేత్తలకు రైతుల భూములను పంచి పెడుతున్నారని ఆందోళన చేశారు. ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు. సింగూరు, నందిగ్రాంలలో తృణమూల్ ఆందోళన తీవ్రరూపం దాల్చింది. దాని ప్రభావం రాష్ట్రమంతటా పాకింది. లెఫ్ట్ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి అని ముద్ర వేయడంలో మమత సక్సెస్ అయ్యారు. అందుకే ఆమెకు జనం ఓటేశారు.
మమతా బెనర్జీ ఐదేళ్ల కాలంలో రాష్ట్రం ముందుకు పోవడానికి బదులు వెనక్కి వెళ్లిందని కామ్రేడ్లు విమర్శిస్తున్నారు. ఏ రంగంలో చూసినా ఆశించిన ప్రగతి లేదనే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు ఆశించినంత గొప్పగా పరిపాలన లేదనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. అయితే, ఇంత జరిగినా మమత ఏదో చేస్తారని ఇప్పటికీ కొన్ని వర్గాల ప్రజలు ఆశతో ఉన్నారు. వారే ఆమెకు కొండంత అండ కావచ్చనే అభిప్రాయం వినవస్తోంది.
మరోవైపు, ఎంతో కొంత బలం పుంజుకున్న బీజేపీ ఎవరి ఓట్లను చీలుస్తుందనేది కీలకంగా మారింది. ఎంపీ సీట్లను ఒకటి రెండుకు పెంచుకున్న బీజేపీ, 2014లో దాదాపు 18 శాతం ఓట్లను పొందింది. ఆనాటి పరిస్థితి వేరు. యూపీఏ ప్రభుత్వ వ్యతిరేకత, మోడీ హవా కారణంగా ఆ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అంత సీన్ ఉంటుందా అనేది ప్రశ్న. అయితే, నగరాలు, పట్టణాలు, బీర్ భూమ్ వంటి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరిగింది. చాలా చోట్ల ముస్లింలు కూడా కమలనాథుల శిబిరంలో చేరిపోయారు. అప్పట్లో సీపీఎం, ఇప్పుడు తృణమూల్ కార్యకర్తల ఆగడాలతో వేగలేక పోతున్నామని వారు బాహాటంగానే చెప్తున్నారు. వీరికి బీజేపీ కొండంత అండగా కనిపిస్తోంది. కాబట్టి బీజేపీని ఇప్పుడు విస్మరించే పరిస్థితి లేదు. ఆ పార్టీ వీలైనన్ని సీట్లను గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కాషాయపార్టీ ఎవరికి గండికొడుతుందనేది ఇప్పుడే తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిస్తే అది కామ్రేడ్లకు నష్టం చేస్తుంది. తృణమూల్, బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపిస్తోంది. ఇది నిజమా కాదా తేలాలంటే ఓట్ల లెక్కింపు వరకూ ఆగాల్సిందే.