ప్రభాస్ నటిస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల రెడీ అవుతున్నాయి. సలార్, కల్కీ .. ఈ రెండు చిత్రాలు ప్రచారానికి సిద్ధంగా వున్న దశలోనే వున్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాల నుంచి దసరాకి ఎలాంటి అప్డేట్ రాలేదు. దసరా సంగతి పక్కన పెడితే.. ఈసారి ప్రభాస్ పుట్టిన రోజు కూడా కలిసొచ్చింది. అయినప్పటికీ కనీసం ఒక పోస్టర్ ని కూడా వదల్లేదు ఈ సినిమాల నిర్మాతలు.
దీనికి కారణం రెండు సినిమాల నిర్మాణ సంస్థల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అని తెలుస్తుంది. ‘సలార్’ ని హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా విషయంలో హొంబలే ఫిల్మ్స్ చాలా సందర్భాల్లో సరైన కమ్యునికేషన్ ఇవ్వలేదు. సెప్టెంబర్ లో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీనిపై చాలా రోజుల వరకూ నిర్మాణ సంస్థ నుంచి అధికారక ప్రకటన రాలేదు. సినిమా రాదనే నమ్మకంతోనే కొన్ని సినిమాలు సలార్ డేట్ కి మార్చుకున్నాయి. చాలా రోజుల తర్వాత కొత్త డేట్ ఇస్తూ ఓ ప్రకటన చేశారు.
ప్రభాస్ పుట్టిన రోజు, దసరా ఈ రెండు సందర్భాలని పురస్కరించుకొని ఖచ్చితంగా సలార్ నుంచి ఒక పోస్టర్ వస్తుందని అనుకున్నారంతా. కల్కీ సినిమా నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ కూడా అలానే భావించింది. కల్కీ కంటే ముందు సలార్ రిలీజ్ అవుతుంది. దసరా, ప్రభాస్ పుట్టిన రోజున సలార్ కి ప్రమోషన్ కలిసొస్తుందని కల్కీ నిర్మాతలు.. తమ సినిమా అప్డేట్ ని మానుకున్నారు. తీరా చూస్తే సలార్ నుంచి కూడా ఏమీ రాలేదు.
సలార్ పై ఇప్పటికే చాలా హైప్ వుంది. ఆ హైప్ చాలనే ఫీలింగ్ లో హొంబలే ఫిల్మ్స్ వున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాకి సంబధించిన అప్డేట్స్ లేకపోవడానికి మరో కారణం.. తెలుగు రాష్ట్రాల హక్కులు ఇంకా ఎవరికీ అమ్మలేదు. తెలుగు నుంచి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హొంబలే ఫిల్మ్స్ చెబుతన్న రికార్డ్ ధర విని వెనక్కి తగ్గుతున్నారు. తెలుగు హక్కులు అమ్ముడైన తర్వాత సలార్ అప్డేట్స్ వేగం పుంజుకోవచ్చు.