మునుగోడులో కమ్యూనిస్టులకు సాలిడ్ గా పది వేల ఓటు బ్యాంక్ ఉందని అందరికీ తెలుసు. అందుకే ఆ పార్టీ పోటీలో ఉండకుండా.. బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించేలా చేసుకునేందుకు కేసీఆర్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఎప్పుడూ ప్రగతి భవన్ సందుకు కూడా రానివ్వని వామపక్ష నేతలకు ప్రగతి భవన్ లో విందులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేద్దామన్నారు. జాతీయ స్థాయిలో కూడా కలుద్దామన్నారు. దీంతో కమ్యూనిస్టు నేతలు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో ఉన్నా.. తెలంగాణలో మాత్రం బీజేపీని ఓడించాలంటే బీఆర్ఎస్తోనే ఉంటామన్నారు. అయితే మునుగోడు ఎన్నికల తర్వాత కానీ వారికి అసలు సీన్ అర్థం కాలేదు.
ఇప్పుడు కేసీఆర్ కమ్యూనిస్టులను పట్టించుకోవడం లేదు. తలుపులు కూడా తీయడం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీల నేతలు హతాశులయ్యారు. మళ్లీ కాంగ్రెస్ వైపు వెల్తున్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వడం వల్ల జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల బలోపేతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా ఆ పార్టీలు కొత్త కథలు చెబుతున్నాయి. అధికారికంగా ఈ సంగతిని వామపక్షాల అధిష్ఠానాలు ప్రకటించకపోయినప్పటికీ తెలంగాణలో పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే బీఆర్ఎస్ వామపక్షాలను వాడుకుని వదిలేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కాంగ్రెస్ కు దగ్గరరైతే ఒకటి, రెండు సీట్లు అయినా వస్తాయని కమ్యూనిస్టులు ఆశ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించడం కూడా హస్తం పార్టీకి దగ్గరయ్యేందుకేనని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీలో కనీసం ప్రాతినిధ్యం అయినా ఉండాలని కమ్యూనిస్టులు తంటాలు పడుతున్నారు. పొత్తుల్లేకపోతే అది సాధ్యం కాదు. వారి ఆశల్ని కేసీఆర్ అడియాసలు చేస్తున్నారు. మునుగోడులో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అదే పనిగా అడిగినా కమ్యూనిస్టు నేతలు ఈసడించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ వదిలేయడంతో కాంగ్రెస్ దగ్గరకే వెళ్లక తప్పడం లేదు.