“నాది కమ్యూనిస్టు భావజాలం..” “ప్రత్యేకహోదాపై పెద్ద ఉద్యమం చేయబోతున్నా.. రేపు వెళ్లి కమ్యూనిస్టు పార్టీల నేతలతో చర్చలు జరుపుతా..” .. “లెఫ్ట్ పార్టీలతో కలిసి ఉమ్మడి పోరాట కార్యచరణకు సిద్దమవుతున్నా..” ఇలాంటి డైలాగులు… తెలుగు రాష్ట్రాల్లోని కమ్యూనిస్టు నేతలకు.. కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్‌కు ఉన్న జనాకర్షణతో.. తాము మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పూర్వవైభవం పొందుతామని.. ఆశ పడ్డారు. పోరాటాల్లోనే పవన్ కల్యాణ్ పెద్దగా కలవలేదు.. ఇక రాజకీయ పొత్తులతో కలుస్తారన్న గ్యారంటీ లేకపోయింది. ఇప్పటికి లెఫ్ట్ పార్టీల నేతలు… కొన్ని వందల సార్లు… జనసేనతో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ నోటి వెంట.. ఒక్క సారి అంటే.. ఒక్కసారిగా కూడా.. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తామనే మాట రాలేదు. శనివారం రోజు.. విజయవాడలో.. వామపక్షాల రాజకీయ ప్రత్యామ్నాయ మహాగర్జన నిర్వహించాయి. దీనికి జనసేనను ఆహ్వానించారు. కానీ పవన్ కల్యాణ్ స్పందించలేదు. కనీసం ప్రతినిధుల్ని కూడా పంపలేదు. అయితే.. లెఫ్ట ్పార్టీల నేతలు మాత్రం.. జనసేన, లోక్‌సత్తా, బీసీ సంఘాలతో కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించుకున్నారు.
తెలంగాణలో పొత్తుల కోసం చర్చించుకుదామని చెప్పి మరీ సీపీఎంకు పవన్ హ్యాండిచ్చారు. ఏపీలో అసలు సీపీఎం మధు, సీపీఎం రామకృష్ణలకు ప్రస్తుతం అసలు అందుబాటులోకి కూడా రావడం లేదు. అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల వ్యూహం… ఏమిటో అర్థం కాక వామపక్ష పార్టీలు టెన్షన్‌కు గురవుతున్నాయి. తమతో కలిసి పోరాటాలు చేస్తున్న పవన్ కల్యాణ్… వచ్చే ఎన్నికల్లో పొత్తులకు వస్తాడా లేదా అనేది వారికి పెద్ద మిస్టరీగా మారింది. పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం వారు చేయని ప్రయత్నాలు లేవు. కానీ పవన్ కల్యాణ్ నోటి వెంట ఇప్పటి వరకూ పొత్తులనే మాట బయటకు రాలేదు. అయినా జనసేన అధినేత నిర్వహించే ఎలాంటి కార్యక్రమానికైనా.. ఆహ్వానం ఉన్నా.. లేకపోయినా.. సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత మధు కచ్చితంగా హాజరవుతున్నారు. కానీస్పందన లేదు.
కొద్ది రోజుల క్రితం… రాజకీయ ప్రత్యామ్నాయ వేదికగా.. కమ్యూనిస్టులు, జనేసన, లోక్ సత్తా సహా కలసి వచ్చే ఇతర పార్టీలన్నింటితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్పష్టం చేశారు. అయినప్పటికీ జనసేవ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలు… తెలంగాణలో ఉనికి చాటుకున్నా.. ఏపీలో మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఎవరూ పొత్తులు పెట్టుకోకపోవడంతో.. ఒంటరిగా పోటీ చేశారు. ఎక్కడా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అందుకే జనసేనపైనే వామపక్షాలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి.కానీ పవన్ మాత్రం వారిని వెయిటింగ్లో పెట్టారు.