బీజేపీతో కలిసే ఉన్నా.. ఎప్పుడూ దూరంగా లేను… అమిత్ షా అంటే ఇష్టమంటూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయనను… కమ్యూనిస్టులకు దూరం చేశాయి. పవన్‌కు, జనసేనకు పోయే కాలం దగ్గర పడిందని.. సీపీఐ, సీపీఎం నేతలు మండిపడ్డారు. అమిత్ షాను పొగడటం.. పవన్ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని సీపీఎం కార్యదర్సి మధు తీవ్రంగా మండిపడ్డారు. విచ్ఛిన్నకర శక్తిని, మతోన్మాద పార్టీని మెచ్చుకోవడం దారుణమన్నారు. తనది కమ్యూనిస్టు భావజాలమని పవన్ కల్యాణ్.. మొదటి నుంచి చెబుతూంటారు. గత ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టులతోనే పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. అయితే.. పొత్తు నెంబర్ల ప్రకారం.. పొడిచింది కానీ.. రెండు పార్టీల క్యాడర్ మధ్య ఎక్కడా సమన్వయం కనిపించలేదు.
కమ్యూనిస్టులకు చాలా చోట్ల క్యాడర్ లేకపోగా.. ఉన్న చోట్ల.. జనసేన పార్టీ పోటీ చేసింది. జనసేనకు క్యాడర్ ఉన్న కొన్ని చోట్ల.. కమ్యూనిస్టులు పోటీ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. మొత్తంగా.. కమ్యూనిస్టులతో జనసేన పొత్తు ఓ డిజాస్టర్ అయింది. ఎన్నికల తర్వాత ఎవరి దారిన వారు రాజకీయాలు చేసుకుంటున్నారు. ఎవరి పోరాటాలు వారు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పై కమ్యూనిస్టులు కాస్త దూరం పాటిస్తున్నారు. విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారు. అలాగే కమ్యూనిస్టులు చేసిన ఇసుక పోరాటాలకు కూడా.. జనసేన మద్దతు ప్రకటించలేదు. ఈ క్రమంలో… పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరవడంతో పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు పవన్ కల్యాణ్.. బీజేపీతో స్నేహం కోసమే… ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తేలిపోతోంది. అందుకే.. కమ్యూనిస్టులు ఇక పవన్ కల్యాణ్ పై ఆశలు పెట్టుకోకూడదన్న ఉద్దేశంతో.. విమర్శలు ప్రారంభించారు. ఇప్పటికే కమ్యూనిస్టుల బలం.. ఏపీలో దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు.. అసెంబ్లీలో ప్రాతినిధ్యం అయినా దక్కేది. ఇప్పుడు ఏ ఒక్క స్థానంలో డిపాజిట్ కూడా గ్యారంటీ లేకుండా పోయింది. పొత్తులు పెట్టుకుంటే…కొన్ని స్థానాలు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఇతర పార్టీలు కూడా.. కమ్యూనిస్టులపై ఆసక్తి చూపించండం లేదు. ఇప్పుడు జనసేన కూడా దూరమైనట్లే..!