“జగన్‌తో కలిస్తే జనసేన పని అయిపోయినట్లే..!” ఈ మాట అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు కాదు…సీపీఐ నేత రామకృష్ణ. అదీ కూడా పవన్ కల్యాణ్ తమ కార్యాలయానికి వచ్చి.. మాట్లాడి..వెళ్లిన తర్వాత ఈ ప్రకటన చేశారు. తనది కమ్యూనిస్టుల భావజాలమని.. తాను కమ్యూనిస్టు పార్టీలతో కలసి పని చేస్తానని.. మూడు నెలల్లో కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని.. పవన్ కల్యాణ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. కానీ ఒక్క రోజులోనే సీపీఐ నేత రామకృష్ణ పవన్ తీరుపై కాస్తంత సందేహాలతో మాట్లాడారు. జగన్‌తో కలుస్తారేమోనన్న అనుమానాన్ని అంతర్లీనంగా వ్యక్తం చేస్తూ… అలా జరిగితే జనసేన పని అయిపోయినట్లేనని తేల్చేశారు.
పవన్‌పై కమ్యూనిస్టులు అనుమానాలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. పవన్ కల్యాణ్ తనకు అవసరం ఉన్నప్పుడల్లా.. కమ్యూనిస్టుల ప్రస్తావన తెస్తూంటారు. వారితో కలిసి చర్చలు జరపబోతున్నానని… కలసి పోరాటం చేస్తామని ప్రకటనలు చేస్తారు. ఒకటి, రెండు సార్లు చర్చలు జరుపుతారు. తర్వాత పట్టించుకోవడం మానేస్తారు. మళ్లీ ఎప్పుడైనా గుర్తొస్తేనే కమ్యూనిస్టులను సంప్రదిస్తారు. ప్రస్తుతం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం జరుగుతోంది. టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు, ఇతర వేదికలతో కలిసి ఎప్పట్నుంచో పోరాడుతూనే ఉన్నాయి. కానీ వైసీపీ, జసనేన మాత్రమే సైలెంట్‌గా ఉన్నాయి. విమర్శలు వస్తూండటంతో జనసేన నేత… మరోసారి కమ్యూనిస్టులను ఉపయోగించుకున్నారు. విజయవాడలో వారి కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపి… రాజకీయ ప్రకటనలు చేశారు. వారు ప్రకటించిన బంద్‌కు మద్దతిచ్చిరు. అవసరం కాబట్టి.. పవన్ వెళ్లారు. లేకపోతే లేదు. అదే కమ్యూనిస్టు నేతలు.. జనసేన అఫీసుకు వెళ్లినా పట్టించుకునేవారు ఉండరు. కొద్ది రోజుల కిందట.. రామకృష్ణ, మధు ఇద్దరూ.. హైదరాబాద్ ఆఫీసు గేటు బయట గంట వరకూ నిలుచుని ఎదురూచూడాల్సి వచ్చింది.
అదే సమయంలో పవన్ కల్యాణ్ … తన పోరాటయాత్రలో కానీ.. మరో సందర్భంలో కానీ.. కమ్యూనిస్టుల ప్రస్తావన తీసుకురావడం లేదు. ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు తాను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని పదే పదే చెబుతున్నారు. మొదటి సారి ఆవేశంలో చెప్పారనుకున్నా… ఆ తర్వాత కూడా… అదే చెబుతున్నారు. పవన్ తీరు చూస్తూంటే… నిజాయితీగా పోరాడతారనే కమ్యూనిస్టుల పేరును కొంత వరకూ ఉపయోగించుకుందామనే ఆలోచన తప్ప.. వారితో ఎన్నికలకు వెళ్లే ప్రణాళికలు ఏమీ లేవు. అలాంటి సూచనలు కూడా పవన్ ఇంత వరకూ ఇవ్వలేదు. కలసి పోరాడేందుకు మూడు నెలల్లో కార్యాచరణ అంటూ పవన్ చేసిన ప్రకటన కూడా కమ్యూనిస్టులకు అసహనం పెరగడానికి ఓ కారణం చెప్పొచ్చు. ఎన్నికలు పీకలమీదకొస్తే.. ఇంకా నసగడమేమిటన్నది వారి భావన.
ఇక పవన్ కల్యాణ్ స్ట్రాటజీ ప్రకారం చూసినా .. కమ్యూనిస్టుల్లో అనుమానాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీని, వైసీపీని పల్లెత్తు మాట అనడానికి పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో సందేహిస్తున్నారు. ఏదైనా విషయంలో..టీడీపీని, వైసీపీని కలిపిసి.. విమర్శలు చేస్తూ ఓ ట్వీట్ చేస్తారేమో కానీ.. బీజేపీ గురించి మాత్రం…. కనీస ప్రస్తావన కూడా తీసుకురారు. అది ప్రత్యేకహోదా అయినా.. విభజన హామీలు అయినా.. మరొకటయినా.. !. ఇప్పుడు ఏపీలో బీజేపీ… టార్గెట్.. జననసేన, జగన్‌లను కలిపి చంద్రబాబును ఓడించడమన్న చర్చ జరుగుతోంది. పైగా బీజేపీ అంటేనే వామపక్షాలకు ప్రథమ శత్రువు. తనకు వామపక్షభావజాలం ఉంటుందన్న పవన్ కల్యాణ్.. బీజేపీనే తన అన్నీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే పవన్‌పై కమ్యూనిస్టుల్లో అనుమానాలు పెరగడానికి కారణణయింది.
—- సుభాష్