పేదల కోసం పోరాడే పార్టీలు ఏవీ..? ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఉరిమేది ఎవరు..? బుల్లెట్లకు ఎదురెళ్లి లాఠీ దెబ్బలకు వెరువని నిస్వార్థ రాజకీయ పార్టీలు ఏవి..? దేశంలో ఉన్న అత్యంత నీతిమంతులైన నేతలు ఏ పార్టీలో ఉన్నారు..? … ఇలా చెప్పుకుంటూ పోతే.. మంచి లక్షణాలున్న పార్టీల్లో.. మొట్టమొదటిగా వినిపించే పేరు కమ్యూనిస్టు పార్టీలే. ఇప్పుడీ పార్టీలకు అంతిమ ఘడియలు వచ్చేశాయి.
ఆరు సీట్లకు పరిమితమైన కమ్యూనిస్టులు…!
స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతీ లోక్‌సభలోనూ కమ్యూనిస్టు పార్టీలు తమదైన ముద్ర వేశారు. వీరు బలంగా ఉన్న రాష్ట్రాల్లో అధికారం చేపట్టారు కానీ.. ఎప్పుడూ.. డొంక తిరుగుడు రాజకీయాలు చేయలేదు. లోక్‌సభలోనూ వారి బలం… ప్రజాప్రయోజనాల చుట్టూనే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడీ కమ్యూనిస్టు పార్టీల ఉనికికే ముప్పు వచ్చి పడింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా.. తొలి సారి.. కమ్యూనిస్టు పార్టీలు… కేవలం ఆరు అంటే.. ఆరు లోక్‌సభ సీట్లకే పరిమితమయ్యాయి. త్రిపురతో పాటు… బెంగాల్, కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని చోట్ల బలంగా ఉన్న సమయం అది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కీలకపాత్ర పోషించింది. కానీ… చారిత్రక తప్పిదాలతో అప్పటి నుండే.. ఆ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోవడం ప్రారంభమయింది. పదిహేడో లోక్‌సభలో కమ్యూనిస్టు పార్టీల బలం ఆరు సీట్లు. ఇందులో సీపీఎంకి నాలుగు, సీపీఐకి రెండు ఉన్నాయి.
చారిత్రక తప్పిదాలతో అదే పనిగా పతనం..!
2004 పధ్నాలుగో లోక్‌సభలో సీపీఐ, సీపీఎంలతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలు కలిసి గెలుచుకున్న సీట్లు 59. అదే 2009కి వచ్చే సరికి… పదిహేనో లోక్‌సభలో.. ఆ పార్టీలు.. తిరిగి నిలబెట్టుకున్న సీట్లు కేవలం 24. ఐదేళ్లలో ఏ మాత్రం పెరగకపోగా.. 35 సీట్లకు కోత పడింది. ఇక 2014లో జరిగిన జరిగిన పదహారో లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి మరింత పతనం ఎదురయింది. ఈ సారి పన్నెండు సీట్లకే పరిమితం అయింది. ఇక మొన్న జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల్లో … కమ్యూనిస్టులు దక్కించుకున్నది.. ఆరు అంటే ఆరు సీట్లు. దీంతో…. మెల్లగా… కమ్యూనిస్టు పార్టీలు అంతర్ధానం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. బెంగాల్, కేరళ, త్రిపురల్లో.. ఏళ్ల తరబడి… కమ్యూనిస్టులు పాలన సాగించారు. కేరళలో.. అప్పుడప్పుడూ పరాజయం పాలవుతున్నా.. పశ్చిమ బెంగాల్, త్రిపురలు మాత్రం వామపక్షాలకు కంచుకోటలుగా ఉండిపోయాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు ఇతర పార్టీలకు చోటే లేకుండా… చేసిన కమ్యూనిస్టులకు.. ఇప్పుడు బెంగాల్లో చోటు లేదు. ఒక్కటంటే.. ఒక్క పార్లమెంట్ సీటును గెలుచుకోలేకపోయారు. బెంగాల్లో సీపీఎం కూటమికి మైనార్టీ, గ్రామీణ బెంగాలీ ఓటర్లు దూరమయ్యారు. ఈ ఓటర్లు టీఎంసీ వైపు వెళ్లారు.
యువతను ఆకట్టుకోవడంలో వైఫల్యం..!
సిద్ధాంతపరంగా.. కమ్యూనిస్టులకు పూర్తి వ్యతిరేక భావం ఉండే.. భారతీయ జనతా పార్టీ ఒక సరికొత్త వ్యూహంతో ఎన్నికలలో పాల్గొంటుండగా సిపిఎం కాలం చెల్లిన వ్యూహంతోనే ఎన్నికల సమరంలోకి దిగుతున్నది. రాజకీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వివిధ సామాజిక వర్గాలను తమ ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నాయి. ఈ పథకాలకు మద్దతునివ్వడం వామపక్షాలకు తప్పనిసరి అవుతోంది. ఇది దీర్ఘకాలిక వర్గపోరాటానికి అణగారిన వర్గాల వారి మద్దతు సన్నగిల్లిపోవడానికి కారణం అయింది. వామపక్షాలలోకి కొత్త కార్యకర్తల ప్రవేశం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళ. అధికార పార్టీగా ఉండి.. కేరళలో ఉన్న 21సీట్లలో కేవలం రెండు సీట్లలోనే విజయం సాధించారు.
బూర్జువా నేతలతో ఎగదడం అసంభవమే..! ఎదిగితే అద్భుతమే..!
సార్వత్రిక ఎన్నికల్లో తమ పూర్వపు కంచుకోటలైన… త్రిపుర, బెంగాల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. కానీ.. తమిళనాడులో మాత్రం… డీఎంకేతో పొత్తులో భాగంగా.. సీపీఐ,సీపీఎం చెరో రెండు స్థానాల్లో పోటీ చేసి… విజయం సాధించి… తమ ట్యాలీని ఆరు వరకు లాక్కురాగలిగాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. కమ్యూనిస్టులకు.. ఏ రాష్ట్రంలోనూ బేస్ లేకుండా పోయింది. చారిత్రక తప్పిదాలతో… సంప్రదాయ రాజకీయాలను… ఒంటబట్టించుకోలేకపోవడంతో.. కమ్యూనిస్టులు రాను రాను కుంచించుకుపోయారు. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించినట్లు ప్రకటిస్తున్నా..వారి తీరు మాత్రం మార్చుకోలేకపోయారు. వామపక్ష భావజాలానికి యువతలో ఇప్పటికీ మద్దతు ఉంది. కానీ పార్టీలకు మాత్రమే.. యువత మద్దతు ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా… వచ్చే ఎన్నికల నాటికి ఇక వామపక్షాలు అంతర్థానమైనా… ఆశ్చర్యపోనవసరం లేదు.