మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీతో వెళ్లవద్దని.. కాంగ్రెస్ తో కలవాలని కమ్యూనిస్టు పార్టీ నేతల్ని… కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే బీజేపీని ఓడించే పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీతో కలుస్తామని… కాంగ్రెస్ ను కించపరిచారు కమ్యూనిస్టులు. కాలం గిర్రున తిరిగి.. ఐదారు నెలలు కాక ముందే ఇప్పుడు కమ్యూనిస్టుల్ని కేసీఆర్ ఘోరంగా అవమానించారు. దీంతో ఇప్పుడు తాము చేసిన తప్పేమిటో వారికి తెలిసింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో పని చేస్తున్నామని… తెలంగాణలో కూడా కలిసి పని చేస్తామన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు.
కేసీఆర్ చేసిన మోసంతో తెలంగాణలో వామపక్ష పార్టీలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ ఘోరంగా అవమానించారని .. వాడుకుని వదిలేశారని.. అమాయకంగా మోసపోయామని వారు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్కు తామేంటో చూపించాలని అనుకుంటున్నారు. హైదరాబాద్లో రెండు వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. బీఆర్ఎస్కు బుద్ది చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలపై చర్చించాలని నిర్ణయించారు.
వచ్చే ఎన్నికల్లో పోరాటం హోరాహోరీగా ఉంటుందని దక్షిణ తెలంగాణలో సీపీఐ, సీపీఎం పార్టీలు కీలకమవుతాయని భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయింది. దక్షిణ తెలంగాణలో తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని నమ్ముతున్నారు. బీఆర్ఎస్ ను ఓడిస్తామని…. తామేంటో చూపిస్తామని.. అందుకు కాంగ్రెస్ తో కలుస్తామని వామపక్ష నేతలంటున్నారు.