జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి.. మొదటి నుంచి ఆప్తమిత్రులుగా ఉన్న కమ్యూనిస్టులనూ దూరం చేసింది. తాము విశాఖ లాంగ్ మార్చ్‌లో పాల్గొనడం లేదని.. సీపీఐ, సీపీఎం పార్టీల ఏపీ కార్యదర్శులు జసేనానికి లేఖ రాశారు. అయితే.. లాంగ్ మార్చ్‌కు సంఘిభావం మాత్రం తెలిపారు. పవన్ చేపట్టిన ఇసుక నిరసనకు..మొదటగా.. బీజేపీ సహకారం తీసుకోవాలని పవన్ అనుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు ఫోన్ చేశారు. ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే.. బీజేపీలో వైసీపీకి అనుకూలంగా ఉండే కోటరి మాత్రం అడ్డుపడినట్లుగా ప్రచారం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి.. తాము పవన్ కల్యాణ్‌తో వేదిక పంచుకోబోమని ప్రకటించారు. దీంతో.. పవన్ ప్రయత్నం ఫెయిలయింది. విశాఖ లాంగ్ మార్చ్‌లో బీజేపీ పాల్గొనడం లేదని ప్రకటించేసింది.
బీజేపీని మద్దతు అడిగి లేదనిపించుకున్న పవన్ కల్యాణ్‌కు.. మరో వైపు కమ్యూనిస్టులు.. ఇదే కారణంతో షాక్ ఇచ్చారు. బీజేపీ మద్దతు తీసుకోవాలన్న పవన్ కల్యాణ్‌తో.. తాము ఇక ఎంత మాత్రం.. సత్సంబంధాలు కొనసాగించలేమన్న నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని చెబుతూ లేఖ రాశారు. పవన్ వైఖరి తమకు ఆమోదయోగ్యం కానందున.. విశాఖ లాంగ్‌మార్చ్‌కు రాలేకపోతున్నామని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఈ మేరకు లేఖలు పంపారు. ఇది జనసేనకు శరాఘాతం లాంటింది.
పవన్ కల్యాణ్ తనకు కమ్యూనిస్టుల భావాలున్నాయని ఘనంగా ప్రకటించుకోవడమే కాదు.. టీడీపీ హయాంలో… కమ్యూనిస్టులతో కలిసి పోరాటాలు చేశారు. ఎన్నికల్లో కూడా కలసి పోటీ చేశారు. అయితే.. ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం మాత్రం కొరవడింది. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైపోవడంతో.. ఎవరికి వారు పోరాటాలు చేసుకుంటున్నారు. ఇసుక సమస్యపై.. కమ్యూనిస్టులు చాలా దూకుడుగా ఇప్పుటికే రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల్ని పెద్దగా గుర్తించని పవన్ కల్యాణ్… బీజేపీ, టీడీపీల మద్దతు కోసం ప్రధానంగా ప్రయత్నించారు. ఇప్పుడు.. వీరు కమ్యూనిస్టులు దూరయ్యారు. విశాఖ లాంగ్ మార్చ్‌లో టీడీపీ మద్దతు మాత్రమే.. జనసేనకు లభించే అవకాశం కనిపిస్తోంది.