మామూలుగాే ఉప ఎన్నికలు ప్రభుత్వాల విధానాలపట్ల వ్యతిరేకత ప్రకటించే సందర్భాలుగా వుంటాయి. అన్ని పార్టీలూ ఆ ప్రకారమే విధానాన్ని ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు హౌరాహౌరీగా జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల వైఖరి ఎలా వుంటుందనేది ఆసక్తికరమైన అంశంగా వుండింది. సిపిఎం వైసీపీకి దగ్గరగా వున్నట్టు ఒక నిరాధారమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై చాలా వూహాగానాలు నడిచాయి. కాంగ్రెస్ అభ్యర్థి కూడా రంగంలో వున్న పరిస్థితి. దీనిపై ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్రకార్యదర్శులు మధు, రామకృష్ణ ఉమ్మడిగా ప్రకటన చేస్తూ టిడిపి బిజెపి కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్కు విభజన సమయంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హౌదా, మరీ ముఖ్యంగా రాయలసీమ సమస్యలు ఈ ఎన్నికల ప్రచారంలో మరుగునపడిపోవడం కమ్యూనిస్టులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. తమాషా ఏమంటే టిడిపికి భాగస్వామ్య పక్షమైన బిజెపి ఈ ఎన్నికల రంగంలో అస్సలు కనిపించడం లేదు. నంద్యాలలో గణనీయమైన సంఖ్యలో మైనార్టి ఓటర్లు వున్నందువల్లనే కావచ్చు- టిడిపి బిజెపిని దూరం పెట్టినట్టు కనిపిస్తుంది. అంతేగాక బిజెపికి ఇప్పుడు వైసీపీతోనూ సంబంధాలు ఏర్పడ్డం వారికి కష్టంగా వుంది. బిజెపి ఎపి నేతలైతే తాము టిడిపినే బలపరుస్తామని ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆ పార్టీ ఇష్ట్ణమని సమర్తించుకుంటున్నారు. ఈ రెండు పార్టీలూ బిజెపి చేతిలో కీలుబొమ్మలన్నది కాంగ్రెస్ వాదనగా వుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం వైసీపీ టీడీపీ మధ్యనేనని చెప్పనవసరం లేదు.