అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుట్టుకొచ్చిన మహాకూటమి… ఇప్పుడు హుజూర్ నగర్ ఎన్నికలతో చెల్లాచెదురైంది. ప్రతిపక్షాల ఐక్యతకు గండిపడింది. ఈ పరిణామం తెరాసకు రాజకీయంగా కలిసొచ్చేదే. ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటిపై నిలిపి ఉంచలేకపోవడం కాంగ్రెస్ ప్రయత్నలోపం. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో సొంతదారులు వెతుక్కున్న పార్టీలు నిజంగానే సొంతంగానే బలపడే అవకాశాలున్నాయా అనేదీ ప్రశ్న..? ఉనికి కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తోంది. కోదండరామ్ పార్టీ టీజేఎస్ కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వాలని అధికారికంగా నిర్ణయించింది. ఆ రెండు పార్టీలూ వారివారి వ్యూహాలు స్పష్టంగానే వ్యక్తం చేస్తున్నాయి. కానీ, తెరాసతో పొత్తుకు బయల్దేరిన సీపీఐ… ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పలేకపోతోంది. ఇన్నాళ్లూ లేనిది, ఇప్పుడు హుజూర్ నగర్ ఎన్నికకు వచ్చేసరికి తెరాసతో ఎందుకు కావాల్సి వచ్చిందనే వివరణ ఇవ్వలేకపోతోంది.
ఆ పార్టీ తెరాస నుంచి ఏమి ఆశిస్తోంది…? రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అధిక స్థానాలు తమకు ఇస్తుందనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ పొత్తు కొనసాగిస్తే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనే ఆశ సీపీఐ నేతల్లో ఉంది. అయితే, ఆ స్థాయిలో సీఎం కేసీఆర్ ని నమ్మొచ్చా అనేది కమ్యూనిష్టులు విశ్లేషించుకున్నట్టు లేరు! హుజూర్ నగర్లో ఓ పదివేల ఓటు బ్యాంకు ఇప్పుడు తెరాసకు అవసరమైంది, అంతే! అంతకుమించి కమ్యూనిష్టులతో కలకాలం కలిసి కాపురం కేసీఆర్ చేస్తారని కలలో కూడా ఎవ్వరూ అనుకోరు! ఈ ఉప ఎన్నిక వరకూ మాత్రమే పొత్తు అని సీపీఐ నేతలు ఇప్పుడు అంటున్నారు. ఆ తరువాతి పరిస్థితి ఏంటి..? మహా కూటమిని దూరం చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీతో కలవలేరు, టీడీపీ, సీపీఎం, టీజేయస్… ఇలా ఏ పార్టీతోనే సమీప భవిష్యత్తులో కలిసే అవకాశం ఉండదు. అంటే, హుజూర్ నగర్ ఉప ఎన్నిక తరువాత సీపీఐ సొంతంగా తన ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు కేసీఆర్ తో సయోధ్య కుదిరింది కాబట్టి, పోడు భూముల గురించో, కొత్త రెవెన్యూ చట్టంలో మార్పుల గురించో, యురేనియం తవ్వకాల గురించో ఈ మధ్య సీపీఐ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలూ కోరుతున్న మార్పులను కేసీఆర్ తో ఒప్పించగలిగితే… తెరాసతో పొత్తు కుదుర్చుకున్నందుకు ఫలితం దక్కినట్టు అవుతుంది. అయితే, కొత్త రెవెన్యూ చట్టం, పోడు భూములు, యురేనియం అంశం.. ఇలా ఏ సమస్య తీసుకున్నా ఇతర పార్టీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కేసీఆర్ అనుకోవడం లేదు! హుజూర్ నగర్లో మద్దతు ఇస్తున్నారు కదా… వారి మాట విందామనే సానుకూల ధోరణి కేసీఆర్ లో అనూహ్యంగా వచ్చేస్తుందా… ఆ అవకాశాలూ కనిపించడం లేదు. మరి, ఏం ఆశించి తెరాసతో పొత్తు సీపీఐ వెళ్లినట్టు..? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యత తమకు ఇవ్వలేదని చాడా వెంకట రెడ్డి, నారాయణలు ఇప్పుడు చెబుతున్నారు. ఇదే తెరాసతో పొత్తుకి కారణమని చెప్పడం అర్థం లేని మాట. కాంగ్రెస్ తీరు నచ్చకపోతే అసెంబ్లీ ఎన్నికలప్పుడే బయటకి వచ్చేయాల్సింది! మొత్తానికి, హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ తీసుకున్న నిర్ణయం… ఆ పార్టీ ఉనికినే ప్రమాదంలో పడేసే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.