మునుగోడు ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యం చూసి ఆ పార్టీ నేతలు పొంగిపోయారు. ఎన్నికలు అయిన తర్వాత వారికి అసలు సినిమా కనిపించింది. ఏవీ నాటి హిమసుమములు అన్నట్లుగా మునుగోడు ఎన్నికలప్పుడు లభించిన రాచ మర్యాదలు కాదు కదా ప్రగతి భవన్ గేటు దగ్గరకు కూడా వారికి అనుమతి లభించలేదు. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ సపోర్టుతోనేనని ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి గగ్గోలు పెట్టారు.
మునుగోడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు తమను కేసీఆర్ డంప్ చేయబోరని.. తలా మూడు సీట్లు అయినా ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. రోజులు గడిచే కొద్దీ వారికి కనీస గౌరవం కూడా కరువు అయింది. చివరికి పొత్తులు ఉండవు అని కూడా చెప్పకుండా అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. దీంతో కమ్యూనిస్టు నేతల పరువు పోయినట్లయింది. మునుగోడులో పూర్తి స్థాయిలో వాడుకుని ఇప్పుడు రోడ్డున పడేశారని వాపోవడం వారి వంతు అయింది. కేసీఆర్ తో రాజకీయం ఎవరికైనా అంతే ఉంటుంది .
అవసరం అయితే.. ప్రగతి భవన్ కు పిలిచి మటన్ విందులు ఏర్పాటు చేస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత.. సాయం చేసిన వారికి చిన్న సాయం కావాల్సి వచ్చినా ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఇటీవల గద్దర్ విషయంలో బయటకు వచ్చిన వీడియోలు చూసి అదే అనుకున్నారు. చాలా మంది నేతలకు అదే అనుభవం ఎదురయింది. ఇప్పుడు కమ్యూనిస్టులను పీల్చిపిప్పి చేసి పడేసారు.