ముద్రగడ కు మద్దతుగా కాపుపెద్దలు ఇచ్చిన పిలుపు పై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శనివారం నాటి బంద్ పాక్షికంగానే సఫలమైంది.
తుని విధ్వంసం కేసులో అరెస్టయిన వారి వివరాలను పోలీసులు వెల్లడించాక ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష పట్ల జనబాహుళ్యంలో ఆసక్తి లేకుండా పోవడం ఇందుకు ముఖ్యకారణం. ఈ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం గెరిల్లా యుద్ధం లాంటి ఎత్తుగడలతో సాగిపోతోంది.
వివిధశాఖల అధికారులు ముందు జాగ్రత్తగా ఆఫీసుల్ని మూసేశారు. ఉదయం పూట బస్ సర్వీసులను ఆర్టీసి రద్దు చేసింది. ముద్రగడ మద్దతుదారులంటే ఏదైనా తగలబెట్టేసేవారన్నంత బిల్డప్ ఇచ్చి ప్రజలమేలుకోసమే అన్నట్టు పోలీసుల్ని దింపేసి కవాతులు చేయిస్తున్నారు. ఈవాతావరణం వల్ల
కాపు సామాజిక వర్గంలో ముద్రగడను కాదనలేని, ఔననలేని సంకట పరిస్ధితి ఏర్పడింది.
ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబీకులు వున్న రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి రెండువైపులా రెండుకిలోమీటర్ల రోడ్డులో వాహనాల ను పోలీసులు నిషేధించారు. రోగులు, వారి అటెండెంట్లు అంతేసి దూరం చచ్చినట్టు నడుస్తూ నరకంచూస్తున్నారు. వాళ్ళ తిట్లు వింటే ఉద్యమకారులు తలెత్తుకోలేరు.
ముద్రగడను చూడటానికి, మాట్లాడటానికి మీడియాతో సహా ఎవరినీ పోలీసులు అనుమతించడంలేదు. ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని బులిటెన్లు జారీ చేస్తున్నారు. వైద్యపరీక్షలకు కూడా ముద్రగడ అనుమతించడంలేదని, బలవంతంగా సెలైన్ ఎక్కిస్తే తలగోడకేసి కొట్టేసుకుంటానని ఆయన హెచ్చరించినట్టు సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. ఆవిషయం దృవీకరించుకోడానికి వైద్యాధికారులను కలవాలంటే పోలీసులు ఒప్పుకోవడం లేదు.
కాపుల సాంధ్రత హెచ్చుగా వున్న గోదావరి జిల్లాల్లో ప్రతి ముఖ్యపట్టణంలోనూ శనివారం ఉదయం నుంచే పోలీసులు కాపు ప్రముఖుల నివాసాలకు వెళ్ళి ”మీరు గృహనిర్భంధంలో వున్నారు. బయటకు రావడానికి వీల్లేదు” అని శాసించారు. తూర్పుగోదావరిలో 50 మందిని హౌస్ అరెస్ట్ చేసినట్టు పోలీసుశాఖ ప్రకటించింది. అయితే రెండుజిల్లాలలోనూ హౌస్ అరెస్టుల సంఖ్య 200 నుంచి 250 వరకూ వుందని కాపు నాయకులు, ముద్రగడ మద్దతు దారులు చెబుతున్నారు.
ఇలాంటి హౌస్ అరెస్టులు ఇంతకుముందు ఎపుడైనా జరిగాయా? కాపుల మీద ఇంత కక్షా అన్న విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇదే సెంటిమెంటుగా మారితే ముద్రగడమీద ఆయన సామాజిక వర్గంలో ఎమోషనల్ సపోర్టు పెరిగే అవకాశం వుంది.
ఏది ఏమైనా పరిస్ధితి పూర్తిగా రాష్ట్రప్రభుతం అదుపులోనే వున్నట్టు కనిపిస్తోంది. ఇంత బందోబస్తు, హడావిడీ అవసరమా అని అడిగినపుడు” శాంతి భద్రతలను కాపాడటానికి ఏమైనా చేస్తాం! తుని సంఘటనలను చూశాక కూడా దేనికైనా సిద్దపడకపోతే ఎలా? అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు!