గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉపఎన్నిక వచ్చింది. టీడీపీ ఘన విజయం సాధించింది.వైసీపీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టీడీపీ గెలిచింది. అయితే ఆ విజయం అసంతృప్తి నిప్పుల మీద దుప్పటి కప్పినట్లయింది. అంతా సానుకూలత ఉందనుకుని టీడీపీ ఘోర పరాజయానికి గురైంది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక కూడా అంతే. ఈ ఉపఎన్నిక విజయం.. టీఆర్ఎస్కు సానుకూలత ఉందనుకుంటే… అది రాజకీయ అమాయకత్వమే.
రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. . కానీ.. ప్రజలు తమ వైపే ఉన్నారన్న ఓ కాన్ఫిడెన్స్ ను మాత్రం ఈ విజయం ఇచ్చింది. అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్న ఓ అభిప్రాయాన్ని ఈ ఫలితం పటాపంచలు చేస్తుంది. పక్క చూపులు చూసేవారిని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. మునుగోడు ఉపఎన్నికకు ఎజెండా అంటూ లేదు. ఇక్కడ ఓటింగ్ ఎజెండా ఏమిటి అన్నది డిసైడ్ చేసుకోలేదు. తమకు ఎక్కువ ప్రయోజనం కల్పించిన వారికో.. లేకపోతే మరో కారణంతోనే ఓటేశారు కానీ.. ఎమ్మెల్యేలను లేదా.. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడాని కాదు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగితే… ప్రచారాంశాలు .. ఎజెండా పూర్తిగా మారిపోతాయి. ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లేసేది ప్రభుత్వాలను మార్చడానికి కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓట్లేసేది.. ప్రభుత్వాలను మార్చడానికి లేదా.. కొనసాగించడానికి. ఈ ఎజెండా ప్రకారం ప్రజలు ఓట్లేస్తారు. అందుకే ఉపఎన్నికలతో పోలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తాయి. రాజకీయ పార్టీలు ఉపఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా.. ఎలాంటి ప్రభావం ఉండదు. ఫైనల్స్‌లో మాత్రం ప్రజలు ఓట్లేసే విధానం వేరు. అందుకే ఈ విషయంలో తెలంగాణ రాజకీయ పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.