ప్రభుత్వ ఉద్యోగం అంటే అదో భరోసా. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఒకటో తేదీన జీతం వస్తుందనే ఓ భరోసా. అందుకే కాంట్రాక్ట్ ఉద్యోగిగా అయినా సరే చాన్స్ వస్తే చేరిపోదామని చూసేవారు ఎంతో మంది ఉంటారు. తర్వాత క్రమబద్దీకరణ చేస్తారని ఆశలు పెట్టుకుంటారు. రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలు ఎన్నో ఇస్తూంటాయి. అమలు చేసేవారు వారు కొందరే. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. తెలంగాణలో ఉద్యోగులకు ఇలాంటి గుడ్ న్యూస్లు చాలా కాలంగా వస్తున్నాయి. కానీ ఏపీ ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కుతున్నారు.
ప్రశాంతంగా తెలంగాణ ఎంప్లాయీస్ – జీతాల కోసం ఏపీ ఉద్యోగుల ఆందోళన
తెలంగాణ ఉద్యోగులు .. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. తొలి సారి 43 శాతం ఫిట్ మెంట్… ఆ తర్వాత మరోసారి 30శాతం ఫిట్ మెంట్ అందుకున్నారు. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తున్నారు. ఇటీవల ఉద్యోగాల భర్తీ చేపట్టారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ కార్యక్రమాన్నీ పూర్తి చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పీఆర్సీ వేయడమే కాకుండా 17శాతం మధ్యంతర భృతి కూడా ఇచ్చారు. కానీ వైసీపీ సర్కార్ వచ్చిన జీతాన్ని తగ్గించేసింది. డీఏలు ఎగ్గొట్టింది. రకరకాల కారణాలు చెప్పి అసలు జీతం పెరగకుండా చేసింది. దాంతో ఉద్యోగులు నష్టపోయారు. మరో పీఆర్సీ సమయం వచ్చినా ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం లేదు.
ఉద్యోగుల సొమ్ముతో ఏపీ ప్రభుత్వం జల్సాలు !
తెలంగాణలో ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు ఎలాంటి ఇబ్బంది లేదు. వాటిని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వాడుకోలేదు. ఎవరి సొమ్ము వారి ఖాతాల్లోనే ఉంది. కానీ ఏపీలో ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం అనుమతి లేకుండా వాడుకుంది. తమ సొమ్ములో నుంచి తమకు లోన్లు ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. పెండంగ్ డీఏలు..ఇతర సమస్యల పరిష్కారం కోసం .. చర్చల పేరుతో పిలిచి అవమానించడం వంటివి చేస్తున్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నా.. జీతాలు పెరగకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బిందాస్ – ఏపీలో మాత్రం ?
కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తామని జగన్ చాలా హామీలిచ్చారు. ఇంత వరకూ చేయలేదు. తెలంగాణ సర్కార్ చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తెలంగాణలో సుఖంగానే ఉన్నారు. వారి జతాలకు ఇబ్బంది లేదు. కానీ ఏపీలో వారి జీతాలను ప్రభుత్వం వాడుకుంటోంది. వారికి ఎప్పటికి ఇస్తుందో తెలియడం లేదు. వివిధ కార్పొరేషన్లు .. తమ ఔట్ సోర్సంగ్ ఉద్యోగులకు చెల్లించే జీతాల సొమ్మును ప్రభుత్వం వాడేసుకోవడం దుర్భలత్వానికి నిదర్శనం. ఇలాంటి పరిస్థితులు ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని ఇంకా ఉపేక్షిస్తే కొన్ని రోజులకు జీతాలు కూడా రావన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యోగులు గుండెల మీద చేయి వేసుకున్నారు. ప్రభుత్వాల పనితీరు ఇది ఓ కొలమానం అనుకోవచ్చు.