అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రభుత్వంపై చేసిన తిట్ల పురాణం సంచలనం సృష్టించింది. అయితే ఆయనది తప్పని అంటున్నారు కానీ ఇంత కాలం వైసీపీ నేతలు చేసిందేమిటనే ప్రశ్నలు ప్రధానంగా అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేసే విషయంలో కానీ మరో పోరాటం విషయంలో కానీ సంయమనం పాటిస్తుంది. వైసీపీ నేతలు మొదటి నుంచి అలాంటి అభిప్రాయం ఎప్పుడూ పెట్టుకోలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దగ్గర్నుంచి ఆ పార్టీ నేతలందర్నీ ఇష్టారీతిన తిట్టడాన్ని ఓ విధానంగా పెట్టుకున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా అంతే. మంత్రులు కూడా నోరును అదుపులోకి పెట్టుకోలేకపోయారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే దారిలో వెళ్తోంది. అయ్యన్న పాత్రుడు ఘాటు విమర్శలు చేస్తారు కానీ ఇప్పటి వరకూ ఆ తరహాలో ఎప్పుడూ మాట్లాడలేదు. బూతుల స్థాయి విమర్శలు చేయడం ఇదే మొదటి సారి. తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరింత ఆజ్యం పోసేలా మాట్లాడుతున్నారు చర్చిల్లో పాస్టర్లు ” ఓ మై సన్ ” అంటారని దాన్నే తాను తెలుగులో చెప్పానని సమర్థించుకుంటున్నారు. అయ్యన్న వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్న వారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఒకే ప్రశ్న వేస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు బూతులు మాట్లాడినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని .
వైసీపీ నేతలు మీడియా ముందుక వచ్చి అయ్యన్న భాషను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కౌంటర్‌గా వైసీపీ నేతలు వాడిన భాషను చూపిస్తున్నారు విపక్ష నేతలు. దీనికి సమాధానం వైసీపీ నేతల వద్ద లేదు. ఇప్పుడు వైసీపీపై మరింత దూకుడుగా విరుచుకుపడటానికి ఇష్టారీతిన తిట్లు లంకించుకోవడానికిటీడీపీ నేతలకుఓ అవకాశం దక్కింది. కేసుల విషయంలో ఇప్పటికి వారు పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు. కొత్తగా కేసుల గురించి భయపడే పరిస్థితి కూడా పోయిందని టీడీపీ నేతలంటున్నారు. అందుకే ఏపీలో ఇక బూతుల పంచాంగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.