తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ దేవులపల్లి అమర్.. జగన్మోహన్ రెడ్డి మీడియాలో పని చేయడమే అర్హతగా ఏపీలో నెలకు రూ. నాలుగు లక్షల వరకూ జీత భత్యాలు తీసుకుంటూ సలహాదారు పదవిని అనుభవిస్తున్నారు. ఆయన ఎలాంటి సలహాలిచ్చారో తెలియదు కానీ జర్నలిస్టులకు మాత్రం ప్రభుత్వ పరంగా రావాల్సిన ఎలాంటి సాయం రాకపోయినా కనీసం ప్రశ్నించడం లేదనే అపప్రధను మూటగట్టుకుంటున్నారు.
జగన్ సర్కార్ జీవో ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని అంగీకరించిన దేవులపల్లి అమర్..!
కరోనా కారణంతో చనిపోయిన వాళ్లకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం చాలా కాలం కిందట జీవో జారీ చేసింది. ప్రభుత్వం జీవో ఇచ్చిందంటే ఇక నిధులు వస్తాయని.. ఆయా కుటుంబాలు ఆశలు పెట్టుకున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం సాయం వస్తుందని ఎప్పటికప్పుడు తెలిసిన వారి ద్వారా వాకబు చేస్తున్నారు. కానీ ఇంత వరకూ పైసా కూడా విడుదల చేయలేదు. నెలలు గడిచిపోతున్నా ఎందుకు సాయం చే్యడం లేదని జర్నలిస్టు సంఘాల నేతలపైనా ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న దేవులపల్లి అమర్ కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించడం ప్రారంభించారు. దీంతో దేవులపల్లి అమర్‌కు స్పందించకతప్పలేదు.
డబ్బులిస్తే ఖర్చు పెట్టేసుకుంటారనే ఇవ్వలేదంటున్న అమర్..!
విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దేవులపల్లి అమర్.. ప్రభుత్వం జీవో ఇచ్చింది కానీ డబ్బులు ఇవ్వని మాట నిజమేనని చెప్పుకొచ్చారు. డబ్బులిస్తే ఖర్చు పెట్టేసుకుంటారని అందుకే ఇల్లు లాంటి వాటిని కట్టిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్నే వెనకేసుకొచ్చేందుకు ఏ మాత్రం ఆలోచించలేదు. జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జర్నలిస్టు సంఘాల నేతలపై ఆయన ప్రతి విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనాతో చాలా మంది జర్నలిస్టులు చనిపోయారని వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని.. జర్నలిస్ట్ సంఘాల జాతీయ నేత అయిన శ్రీనివాస్ రెడ్డిపై ఆయన ఎదురుదాడికి దిగుతున్నారు.
చనిపోయిన జర్నలిస్టుల పేరుతో ప్రచారం చేసుకుని హ్యాండిస్తారా..?
కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలుకు రూ. ఐదు లక్షలు ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుని ఇప్పటి వరకూ పైసా ఇవ్వని ఏపీ సర్కార్ … ఏమాత్రం సిగ్గుపడతపోగా.. అలాంటి ప్రభుత్వాన్ని దేవులపల్లి అమర్ వంటి జర్నలిస్ట్ సంఘాల పేరుతో పైకి వచ్చిన జర్నలిస్టులు సమర్థిస్తున్నారు. కరోనాకు బలైన జర్నలిస్టుల కుటుంబాల వేదన..రోదనలు ఆయనకు పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.