కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరమ కోసం గ్రీన్ సిగ్నల్ కోసం ఢిల్లీ వెళ్లారు. ఈ సారి ఆరు పేర్లు ఖరారు చేసుకుని వస్తారని గట్టిగా ప్రచారం జరుగుతూండటంతో ఆశావహులంతా ఒక్క సారిగా యాక్టివ్ అయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తన జాబితాతో ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుతో పాటు మరికొంత మంది కోసం లాబీయింగ్ చేస్తున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి భట్టిని కలిసి తన పేరు సిఫారసు చేయాలని కోరారు.
మరో వైపు కొత్తగా పార్టీలో చేరిన వారిని పదవులకు సిఫారసు చేస్తున్నారని కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి కార్యాలయం వద్ద జగ్గారెడ్డి రచ్చ చేశారు. కాంగ్రెస్ పార్టీని చంపేయాలనుకుంటున్నారా అని అక్కడ వారితో ఆవేశపడ్డారు. ఇంకా పలువురు ఆశావహులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డి సామాజిక సమీకరణాలతో పాటు ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పేర్లను సిద్ధం చేసుకున్నారు.
అయితే దీపాదాస్ మున్షి కొంత మంది పేర్లను సిఫారసు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా సీనియర్లు, సీఎం, ఇంచార్జ తమ తమ పేర్లను తీసుకుని ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి జాబితాకు హైకమాండ్ ఆమోద ముద్ర వేస్తుంది.. చివరికి ఈ గొడవంతా ఎందుకని మళ్లీ విస్తరణ వాయిదా వేస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.