తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఎగ్జిట్ పోల్స్ తో ఏర్పడింది. కానీ కాంగ్రెస్ సంస్కృతి గురించి తెలిసిన వారు .. హైకమాండ్ నిర్ణయాలపై అవగాహన ఉన్న వారు… వడ్డించిన విస్తరిని కాలితో తన్నుకునే రకమన్న అనుమానానికి వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు ఎక్కువ మరి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థులం మేమే అనే ప్రకటనలు కనీసం అరడజను మంది నేతల నుంచి వచ్చాయి. గెలిచిన తర్వాత వారు సైలెంట్ గా ఉంటారని అనుకునేందుకు అవకాశం లేదు.
రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ బలోపేతం కావడంలో కీలక నేత. ఇప్పుడు మెజార్టీ వస్తే హైకమాండ్ కూడా .. ఆయనకే సీఎం పదవి ఇస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం వారికి కీలకం. బలమైన నేత సీఎంగా లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి కింద మేము పని చేయడం ఏమిటి అన్న భావనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉంటారు. ముఖ్యంగా కోమటిరెడ్డి అదే భావనను చాలా సార్లు వ్యక్తం చేశారు. తానే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నని.. తనను కాదని ఎవరికీ సీఎం పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. పైగా ఆయన తన అనుచరులకు నల్లగొండలో సీట్లిప్పించుకున్నారు. సోదరుడ్ని పార్టీలోకి తెచ్చారు.
అతి తక్కువ మెజారటీ వస్తే తనను సీఎంను చేయమంటారు కుదరకపోతే రేవంత్ ను తప్ప ఎవరినైనా చేయమంటారు… అలా కాదంటే.. తనతో ఉన్న ఆరేడుగురు ఎమ్మెల్యేతో ఆయన తన దారి తాను చూసుకోవచ్చు. ఇతర సీనియర్ల పరిస్థితి కూడా అదే కావొచ్చు. అందుకే తెలంగాణ ఫలితాల్లో సాధారణ మెజార్టీ వచ్చినా అసలు పరీక్ష కాంగ్రెస్ పార్టీకే ఎదురవుతుంది . కానీ కాంగ్రెస్ పార్టీకి… 70 స్థానాల పైన వస్తే మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్లు సర్దుకోక తప్పదు. ఎందుకంటే… వారికి మరో చాన్స్ ఉండదు.