చట్టాన్ని ఉల్లంఘించారు అనే ఆరోపణలతో ఏపీ సీయస్ ఎల్వీ సుబ్రమణ్యం మీద ఒక ఫిర్యాదు ఇప్పుడు తెర మీదికి వచ్చింది! అదేదో ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదు, లేదా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య నుంచి వచ్చిన ఆరోపణలు కానే కాదు. ఎప్పుడో, 2014లో ఎల్వీ సుబ్రమణ్యం విధి నిర్వహణకు సంబంధించింది. సుబ్రమణ్యం అప్పట్లో సరిగా విధులు నిర్వహంచలేదనీ, దాని వల్ల తాను చాలా మనస్థాపానికి గురయ్యానంటూ శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడంలో ఆయన ఆలస్యం చేశారనీ, కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో కోరారు.
2015లో క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం పనిచేసేవారు. అదే ఏడాది జనవరిలో తనను శాప్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మోహన్ అంటున్నారు. అయితే, ఆ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాల్సి ఉన్నా… ఎల్వీ సుబ్రమణ్యం ఉదాసీన వైఖరితో వ్యవహరించారని మోహన్ ఆరోపణ. ఉద్దేశపూర్వకంగానే నాటి ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించకపోవడం తప్పు అంటున్నారు. దాంతో తాను రెండేళ్లపాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నియామకంపై అనుబంధ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదనీ, నియామకంలో ఉన్న సమస్య ఏంటనేది తనకు తెలియక చాలా బాధపడ్డానన్నారు. ఒక ఉన్నతాధికారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదనీ, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో మోహన్ పేర్కొన్నారు. ఇప్పటికే తాను కాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. దీంతో, తిరుపతి అర్బన్ ఎస్పీని స్పందించి, చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ఠాకూర్ ఆదేశించారు!
మోహన్ నియామక ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఎల్వీ సుబ్రమణ్యం తొక్కిపెడితే, అది కచ్చితంగా తప్పే అవుతుంది. అయితే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే… ఎప్పుడో 2015లో జరిగిన దానిపై ఇప్పుడు మోహన్ స్పందించడం ఏంటని!! ఈయన ఇన్నాళ్లూ ఏం చేసినట్టు అనే అనుమానం కలుగుతోంది. తన నియామకంలో జాప్యానికి కారణం సుబ్రమణ్యమే అని ఇప్పుడే తెలిసొచ్చిందా? అసలే రాజకీయాలు మాంచి హీటు మీద ఉన్న సమయంలో.. సీఎస్ మీద ఫిర్యాదు అనగానే, దీన్ని తెర మీదికి తేవడం వెనక వేరే స్క్రీన్ ప్లే ఉంటుందనే చర్చ కచ్చితంగా జరుగుతుంది. మరీ నాలుగేళ్ల ఆలస్యంగా ఫిర్యాదు చేస్తూ, రెండేళ్ల కిందట వరకూ మనస్థాపానికి గురయ్యానంటూ ఇప్పుడు మోహన్ ఫిర్యాదులో పేర్కొనడం కాస్త విడ్డూరంగా కనిపిస్తోంది.