కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడైన రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంపై దాఖలైన ఫిర్యాదు ఇప్పుడు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి చేరింది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తనవద్దకు వచ్చిన ఫిర్యాదును ఎథిక్స్ కమిటీకి పంపించినట్లు చెప్పారు. ఎథిక్స్ కమిటీ విచారణ చేపడితే రాహుల్ కు రాజకీయ కష్టాలు తప్పవని బిజెపీ నాయకులు కచ్చితాభిప్రాయం. అందుకే ఆ దిశగా పావులు చకచకా కదుపుతున్నారు.
రాహుల్ గాంధీకి ఇంగ్లండ్ పౌరసత్వం ఉన్నదన్న విషయంపై ఆ మధ్య వివాదం రాజుకుంది. అది ఇప్పుడు ముదిరి పాకానపడింది. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఈ ఫిర్యాదు చేరడంతో వాస్తవ కోణాలను వెలికితీయడంకోసం కమిటీ విచారణ చేపట్టే అవకాశముంది. ఒకవేళ విచారణలో ఇంగ్లండ్ లో కూడా పౌరసత్వం ఉన్నట్లు తేలితే రాహుల్ కి ఇబ్బందులు తప్పవు.
ఇంగ్లండ్ పౌరసత్వం విషయంలో రాహుల్ ని ఇరకాటంలో పెట్టే విషయంలో కూడా బిజేపీ నేత సుబ్రమణ్యస్వామి హస్తం నిండుగానే ఉంది. సంచలనాలకు మారుపేరైన సుబ్రమణ్యస్వామి రెండు నెలల క్రిందటే రాహుల్ పౌరసత్వంపై సంచలన ప్రకటన చేశారు. రాహుల్ అసలు భారతీయుడే కాడనీ, ఆయనకు ఇంగ్లండ్ లో పౌరసత్వం ఉన్నదనీ, అక్కడ ఆయన ఒక కంపెనీ కూడా నడుపుతున్నారంటూ విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. 2003 ఆగస్టు 21న రాహుల్ ఇంగ్లండ్ లో కంపెనీ ప్రారంభించారనీ, ఆ కంపెనీకి రాహుల్ కార్యదర్శిగా, డైరెక్టర్ గా కొంతకాలం పనిచేశారని కూడా స్వామి అప్పట్లో వెల్లడించారు. అయితే ఈ కంపెనీని 2009లో మూసేశారని , కంపెనీ తన వార్షిక ఆదాయాన్ని బ్రిటీష్ ప్రభుత్వానికి రెండుసార్లు సమర్పించిందని కూడా డొంకంతా లాగారు సుబ్రమణ్యస్వామి. ఇలా కంపెనీ పెట్టేటప్పుడు రాహుల్, తనకు బ్రిటీష్ పౌరసత్వం ఉన్నట్లుగా దరఖాస్తులో పేర్కొన్నారన్నది మరో కీలక పాయింట్. ఇవేవీ సుబ్రమణ్యస్వామి
ఊహాజనిత వివరాలు కావని తర్వాత తేలిపోయింది. రాహుల్ గాంధీ పేరుతో లండన్ చిరునామాతో కంపెనీ ఉన్నట్లు బ్రిటీష్ అధికార వర్గాలు తేల్చిచెప్పాయి. మనదేశంలో ద్వంద పౌరసత్వ విధానం లేదు. ఇంగ్లండ్ లో పౌరసత్వం ఉన్నట్లు తేలితే రాహుల్ పై చర్య తీసుకోవచ్చు. పార్లమెంట్ సభ్యత్వం నుంచి కూడా తొలగించే అవకాశాలున్నాయి. అందుకే బిజెపీ చాలా తెలివిగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలుచేయడానికి ఇదో ఆయుధంగా బిజెపీ భావిస్తోంది.
ఈ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరినట్లయింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మహేష్ గిర్రి కొంతకాలం క్రిందట లోక్ సభ స్పీకర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేస్తూ, రాహుల్ పౌరసత్వంపై విచారణ జరిపించాలని కోరారు. తన పార్టీ నాయకుడైన సుబ్రమణ్యస్వామి చేస్తున్న ఆరోపణల దృష్ట్యా ఈ వ్యవహారంలోని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఈ ఎంపీ విజ్ఞప్తి చేశారు. అలా దాఖలైన దర్యాప్తును లోక్ సభ స్పీకర్ ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి ఫార్వార్డ్ చేశారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి అధ్యక్షునిగా బిజెపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఉండటం గమనార్హం. ఈ ఫిర్యాదుని విచారణ నిమిత్తం ఎథిక్స్ కమిటికీ పంపినట్లు స్పీకర్ మహాజన్ అధికారికంగా ధ్రువీకరించారని స్వామి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మొన్నీమధ్యనే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా-రాహుల్ ను కోర్టు ఎదుట నిలబెట్టించిన స్వామికి రాహుల్ పౌరసత్వం విషయంలో కూడా విజయం దక్కుతుందా ? ఈ ప్రశ్నకు సమాధానం మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.