సాక్షి పత్రిక, టీవీలలో వస్తున్న కథనాలు.. తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. కనీస మాత్రం నిజం లేకుండా కేవలం బరదచల్లుడు కోసమే కథనాలు రాస్తున్నారని.. ఓ పార్టీ నిర్వహిస్తున్న పత్రిక.. మరో పార్టీపై ఇలా అసత్యాలు ప్రచారం చేయడం… ప్రెస్‌కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్ నిబంధనలకు విరుద్దమని అంటున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రెస్‌కౌన్సిల్‌కు… ఎడిటర్స్ గిల్డ్‌కు.. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఇందులోప్రధానంగా.. ఐటీ దాడులపై వచ్చిన కథనాలనే ప్రస్తావించారు. ఫిబ్రవరి 14వ తేదిన సాక్షిలో “మచ్చుకు రెండు వేల కోట్లు, చంద్రబాబు కొండంత అవినీతిపై గోరంత వెలుగు” అనే పేరుతో బ్యానర్ స్టోరీని ప్రచురించారు. ఇదే అంశాలతో.. 15వ తేదిన సాక్షి టీవీలోనూ ప్రసారం చేశారు.
ఈ కథనానికి ఆధారం.. సీబీడీటీ విడుదల చేసిన ప్రెస్‌నోట్. ఆ ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు. అలాగే ఎవరి పేర్లు లేవు. మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు.. ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ అని మాత్రమే ఉంది. ఆ ప్రముఖ వ్యక్తి చంద్రబాబు అనుకున్నా.. చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటి పై నిర్వహించిన దాడుల్లో రెండు లక్షల 63వేల రూపాయల నగదు, 12తులాల బంగారం మాత్రమే చేసుకున్నట్లుగా పంచనామా రిపోర్ట్ విడుదలైన తర్వతా కూడా..అదే ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ధేశించిన జర్నలిజం ప్రమాణాలకు వ్యతిరేకంగా జగన్ మీడియా వ్యవహరిస్తోందన్నారు.
ఒక రాజకీయ పార్టీ స్థాపించిన పత్రిక, మరో రాజకీయ పార్టీ పై దురుద్దేశపూరితంగా వ్యవహరించడం అభ్యంతరకరమని టీడీపీ నేతలు చెబుతున్నారు. సాక్షి ప్రచురించిన కథనాలు, ప్రసారం చేసిన క్లిప్పింగ్ లను పరిశీలించి సాక్షి ఎడిటర్, రాసిన విలేఖరిపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ప్రెస్‌కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్.. మీడియాను కట్టడి చేసేందుకు.. జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన జీవోపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పుడు.. తాము అంతకు మించిన స్వేచ్ఛను అనుభవిస్తూ.. ప్రత్యర్థి పార్టీపై ఇష్టం వచ్చినట్లుగా కథనాలు రాయడంపై ప్రెస్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.