తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కవిత, మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఫేక్ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్లు దోపీడీ జరిగిందని భాస్కర్ చెప్పారు. తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని భాస్కర్ తెలిపారు.
ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు. ఇలా ప్రభుత్వం మారగానే అలా ఏసీబీకి ఫిర్యాదు చేయడం.. .వెంటనే ఏసీబీ అధికారులు అక్నాలెడ్జ్ చేయడం సంచలనంగా మారుతుంది. కేసీఆర్ ప్రభుత్వం.. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము వచ్చిన తర్వాత అవినీతిని బయటకు తీస్తామని ఆ సంపదను ప్రజలకు పంచుతామని ఎ్నికల ప్రచారంలో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు . మేఘా కంపెనీ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు చేపడుతుంది. ఈ సంస్థలపై ఫిర్యాదు వెళ్లడంతో ఏం జరగబోతోందోనన్న చర్చ ప్రారంభమయింది.
తెలంగాణ మంత్రులు సహా అనేక మందిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎవర్నీ వదిలి పెట్టే అవకాశం ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో అధికార యంత్రాన్ని ప్రక్షాళన చేసి.. తర్వాత రంగంలోకి దిగే అవకాశం ఉంది.