జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టారు. ఆయన దసపల్లా హోటల్లో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు వెళ్లడం.. ఆ పార్టీలో కొంత మంది నేతలకు నచ్చలేదు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ… పవన్ కల్యాణ్ సమావేశానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ.. హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమక్షంలో.. దీనిపై.. సోమవారం పెద్ద రచ్చే జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెద్దదా… జనసేన పెద్దదా అంటూ.. కొంత మంది స్థాయిలు చూసుకుని మాట్లాడటంతో.. వ్యవహారం సీరియస్ అయిపోయినట్లుగా తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే సంపత్… రేవంత్ రెడ్డిపై విమర్శలకు.. ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలు్సతోంది. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ అని… పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. జాతీయ పార్టీ వెళ్లి జనసేన జెండా కింద కూర్చొని ఎలాంటి సంకేతాలు పంపారని ప్రశ్నించారు. మన పార్టీ పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ రాలేదని గుర్తు చేశారు. సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం ఏంటని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో సంపత్ అభిప్రాయంతో కుంతియా ఏకీభవించారు. అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని చెప్పుకొచ్చారు. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ అక్కడే హామీ ఇచ్చేశారు. మొత్తంగా.. రేవంత్ రెడ్డి చేసింది తప్పన్నట్లుగా.. ఆయన వర్గం.. కలరింగ్ ఇచ్చిందనే అభిప్రాయం ఏర్పడింది.
రాజకీయ పోరాటం విషయంలో.. ఎవరు ముందు.. ఎవరు వెనుకా అని చూసుకుంటే లక్ష్యం నెరవేరదని కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియక కాదు. కానీ ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన పార్టీని చిన్న బుచ్చుతున్నారన్న ప్రచారం నిర్వహించాడనికే.. ఈ వ్యవహారాన్ని ఉత్తమ్ వర్గం.. పకడ్బందీగా.. కుంతియా ముందు… నడిపిందని అంటున్నారు. కుంతియా కూడా.. ఉత్తమ్‌కే సపోర్ట్ చేస్తున్నారు. అందుకే… అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పన్నట్లుగా మాట్లాడారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డి వర్గం.. నోరు మెదపలేదని తెలుస్తోంది.