మంచు మోహన్ బాబుపై పలికిన ఓ డైలాగ్ వివాదాస్పదమయింది. ఆయనపై రెండు తెలుగు రాష్ట్రాల సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మొదట అనంతపురం జిల్లాలో ఓ యాదవ సంఘం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు తమనుకించ పరిచారని.. తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ” సినిమా ఎన్నికల్లో ఏమిటీ గొడవలు.. ఏమిటి బీభత్సం.. ఏంటి ఘర్షణలు.. ప్రజలందరూ చూస్తున్నారు.. గొర్రెలు, మేకలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది.. అతను కూడా ఇక్కడ జరిగిందంతా చూస్తున్నాడు.
అతనికి కూడా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందని.. ” అని మోహన్ బాబు అన్నారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తమ వృత్తిని అవమానించేలా ఉన్నాయని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో ఫిర్యాదులు ప్రారంభమైనా.. తెలంగాణలో మాత్రం జోరందుకున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో తమను కించపరిచేలా మాట్లాడిన సినీనటుడు మంచు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు ఫిర్యాదు చేశారు.
తక్షణం మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతూండటంతో మోహన్ బాబు కూడా స్పందించే అవకాశం ఉంది. ఆయన క్షమాపణలు చెప్పి వివాదాన్ని ముగిస్తారని భావిస్తున్నారు.