ఉప ఎన్నిక తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నంద్యాల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. పరస్పర ఆరోపణలతో టీడీపీ, వైకాపా నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదేదో ఉప ఎన్నిక అన్నట్టుగా కాకుండా…. ప్రతిపక్ష నేత జగన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్న పోరుగా మారిపోయింది. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన దగ్గర నుంచీ ప్రతీ దశలోనూ నంద్యాల ఉప ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగానే సాగుతూ ఉంది. ఇప్పుడు నామినేషన్ల వరకూ చేరుకుంది. ఈ దశలో ఫిర్యాదుల పర్వానికి తెర లేచింది. రెండు పార్టీల అభ్యర్థులూ రకరకాల అభ్యంతరాలను తెరమీది తెస్తున్నారు. నంద్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీద జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి మంత్రి భూమా అఖిల ప్రియ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై తాజాగా టీడీపీ మరో ఫిర్యాదు చేసింది.
వైకాపా తరఫున శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ చెల్లదంటూ తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెబుతోంది. శిల్పా దాఖలు చేసిన బీఫామ్ నోటరీపై ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటు, జిల్లా కలెక్టర్ కూ ఫిర్యాదు చేశారు. ఈ నోటరీ చేసిన లాయర్ రామ తులసీ రెడ్డి నోటరీ లైసెన్స్ ఎప్పుడో రద్దయిందనీ, 2013 డిసెంబర్లో లైసెన్స్ రద్దయితే, ఆయన నోటరీ చేస్తే ఎలా చెల్లుతుందని టీడీపీ అంటోంది. దీనికి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా అధికారులకు టీడీపీ నేతలు అందించారు. దీంతోపాటు ఇంకో అభ్యంతరం ఏంటంటే.. నామినేషన్ పత్రాలతోపాటు దాఖలు చేయాల్సిన జ్యుడిషియల్ స్టాంపును కూడా శిల్పా మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ వివరాలన్నీ పొందుపరచి టీడీపీ పంపిన లేఖను ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కూడా ఈ అంశంపై దృష్టి సారించారనీ, నిపుణులతో చర్చలు జరుపుతున్నారనీ, చర్యలు తప్పకుండా ఉంటాయని టీడీపీ నాయకులు అంటున్నారు. 2009 లో ఇలాంటి పరిస్థితే కదిరి బాబూరావుకు ఎదురైంది. దీంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించారు. శిల్పా నామినేషన్ విషయంలో ఇదే జరుగుతుందనే ఆందోళనలో వైకాపా వర్గాలున్నట్టుగా కథనాలు మీడియాలో వస్తున్నాయి.
ఇంకోపక్క వైకాపా నేతలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిపై వారూ ఓ ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాలతోపాటు ఆదాయ పన్ను రిటర్న్స్ పత్రాలను టీడీపీ అభ్యర్థి సమర్పించలేదంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైకాపా ఫిర్యాదు చేసింది. దీంతోపాటు కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ మరి కొంతమంది టీడీపీ నేతలపై కూడా వైకాపా ఫిర్యాదు చేశారు. సో.. రెండు పార్టీల మధ్యా ఇలా వరుస ఫిర్యాదుల పోరు జరుగుతోంది. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ విషయమై తెలుగుదేశం వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలపై వైకాపా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.