ఆదివారం జరగనున్న సదరన్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకహోదాను అడుగాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలూ అదే చెప్పాయి. దాంతో మీడియాలోనూ ఆ అంశం హైలెట్ అయింది. తీరా చూస్తే.. సదరన్ కౌన్సిల్ సమావేశ ఏజెండాలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో ప్రత్యేకహోదా ఎక్కడా కనిపించలేదు. ఎజెండాలో ఉన్న వాటిలో ఏడు ఏపీ ప్రతిపాదించినవే ఉన్నాయి. అందులో తమిళనాడు నుంచి రావాల్సిన నిధుల గురించి ఉంది కానీ కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి కనీస ప్రస్తావన కూడాలేదు.
తమిళనాడు బోట్లు ఏపీ జలాల్లోకి రావడం వల్ల ఘర్షణ, కుప్పంలో పాలార్ ప్రాజెక్టుపై తమిళనాడు అభ్యంతరం , తెలుగుగంగ నీరిచ్చినందుకు తమిళనాడు ఇవ్వాల్సిన రూ.338 కోట్లు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు అలాగే ఏపీలో జాతీయ పోలీస్ అకాడమీ పెట్టాల్సిన విజ్ఞప్తులు ఎజెండాలో ఉన్నాయి. అంటే వీటిపైన మాత్రమే చర్చలు జరుపుతారు. ఇక అనధికారింగా ప్రభుత్వం ప్రసంగంలో ఏదైనా అంశాలను మాట్లాడితే మాట్లాడవచ్చు.. లేకపోతేలేదు. విభజన హామీలను ప్రస్తావిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎజెండాలో పెట్టకుండా ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. కొత్తగా మూడు రాజధానులకు నిధులడుగుతామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
ఒక్క ఏపీ అంశాలపైనే సమావేశంలో చర్చ జరగదు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలన్నింటినీ చర్చిస్తారు. ఇతర రాష్ట్రాలుకూడా ఏపీ విషయంలో తమకు ఉన్న సమస్యలను ప్రస్తావిస్తారు. విద్యుత్ సమస్యలను తెలంగాణ కూడా చర్చించనుంది. మొత్తానికి దక్షిణాది కౌన్సిల్ భేటీలో ప్రత్యేకహోదా అడుగుతామన్నది ఉత్త ప్రచారమేనని తేలిపోయింది.