బాక్సైట్ పరిశ్రమ విషయంలో రస్ అల్ ఖైమా ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న న్యాయపోరాటంలో రాజీ కుదరలేదు. అధికారుల బృందాన్ని ఆర్బిట్రేషన్ కోసం రెండు సార్లు లండన్ పంపేందుకు ప్రభుత్వం అనుమతించింది. అర్బిట్రేషన్‌లో రెండు సార్లు విచారణ జరిగింది. అయితే నష్టపరిహారంగా రాకియా రూ. పధ్నాలుగు వందల కోట్ల వరకూ అడుగుతోంది.కానీ ఏపీ సర్కార్ మాత్రం రూ. వంద కోట్లకు అటూ ఇటూగా ఇస్తామని ప్రతిపాదన పెట్టింది. దీనికి రాకియా అంగీకరించలేదు. దీంతో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. విచారణ కూడా ముగిసింది. ఫిబ్రవరిలో తుది తీర్పు రానుంది.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. పెన్నాప్రతాపరెడ్డితో కలిసి రాకియా పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వాలు బాక్సైట్ అనుమతుల్ని రద్దు చేశాయి. తమకు నష్టం వచ్చిందని రాకియా అంతర్జాతీయ వివాదాల పరిష్కార వేదికను ఆశ్రయించింది. అయితే ఏపీ ప్రభుత్వం బాక్సైట్ సరఫరాకు చాలా ప్రయత్నాలు చేసింది. ఒడిషాతో పాటు ఇతర చోట్ల నుంచి బాక్సైట్ ఇవ్వాలని ప్రతిపాదించింది. కేంద్రం అంగీకరించలేదు. వివాదాన్ని ఏపీ ప్రభుత్వమే పరిష్కరించుకోవాలని తేల్చి చెప్పింది.
అన్‌రాక్, ఏపీఎండీసీ మధ్య బాక్సైట్ సరఫరా వివాదం పరిష్కారానికి గతంలోనే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జుల్ఫీ రావ్జీ అనే వ్యక్తికి కూడా చోటు కల్పించింది. జుల్ఫీ కి సహాయకారిగా ఉండేలా… ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు. అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేసినా రాజీ కుదరలేదని.. ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ఆధారంగానే వివాదం ముగియనుందని తెలుస్తోంది. ఈ తీర్పు లో భాగంగా ఏపీ సర్కార్‌కు భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే.. ఏపీ పరువు పోతుంది. అయితే ఇప్పటికే బాక్సైట్ పరిశ్రమను పెన్నా ప్రతాపరెడ్డి మళ్లీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విదేశాల నుంచి బాక్సైట్ తెప్పిస్తున్నారు. అందుకే ఈ కేసు చాలా వరకూ చిక్కుముడి పడిపోయిందని.. కానీ అదే వ్యూహాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.